తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ తేదీ చాలా మంచిది- ఆ రోజే ఎన్నికలు' - trump slams china

అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేస్తారని వస్తోన్న వార్తల నడుమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. తొలుత నిర్ణయించిన తేదీనే ఎన్నికలు జరుగుతాయని శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో కరోనా విషయంలో చైనాపై దర్యాప్తు, ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ ఆరోగ్యంపై మాట్లాడారు.

Trump
ట్రంప్

By

Published : Apr 28, 2020, 10:59 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్ణయించిన తేదీనే జరుగుతాయని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంట్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ.. నవంబర్‌ 3న జరగాల్సిన ఎన్నికల తేదీల్లో మార్పులు జరుగుతాయన్న వార్తలను తోసిపుచ్చారు.

శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు ట్రంప్.

"ఎన్నికల తేదీల్లో మార్పుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నవంబర్‌ 3 అనేది చాలా మంచి తేదీ. "

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ట్రంప్‌ ప్రత్యర్థి జో బిడెన్‌ ఇటీవల ఆన్‌లైన్‌ నిధుల సమీకరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎలాగైనా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయడానికి ట్రంప్‌ ప్రయత్నిస్తారని అన్నారు. అనంతరం ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో వివరిస్తారని బిడెన్‌ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్‌ తాను ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బిడెన్‌ చేయలేదని.. కొందరు పనిగట్టుకొని ఆయన మాట్లాడినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

చైనాపై దర్యాప్తు..

కరోనా వైరస్‌ విషయంలో చైనాపై అమెరికా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తోందని ట్రంప్‌ అన్నారు. కేసులను దాచిపెట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేసిందన్న ఆరోపణలతో చైనాను జర్మనీ అడిగిన 130 బిలియన్ల యూరోల కంటే ఎక్కువ పరిహారాన్ని అమెరికా అడగునుందని సంకేతాలిచ్చారు.

వైరస్‌ వెలుగు చూసిన వెంటనే పారదర్శకతతో వ్యవహరించి సమాచారాన్ని పంచుకొని ఉంటే, ప్రపంచవ్యాప్తంగా లక్షల మరణాలు సహా ఆర్థిక వ్యవస్థల విధ్వంసం ఆగి ఉండేదని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు చైనాను పరిహారం అడగాలని భావిస్తున్నాయి.

ఈ విషయంపై స్పందిస్తూ.. ఎంత మొత్తం అడగాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు ట్రంప్‌. గణనీయ పరిహారమే అడుగుతామని తెలిపారు.

కిమ్ ఎలా ఉన్నారో తెలుసు..

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్​ ఉన్​ ఆరోగ్య స్థితి ఎలా ఉందన్న విషయం తనకు తెలుసని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విషయాన్ని వెల్లడించలేనని తెలిపారు.

"నేను కచ్చితంగా చెప్పలేను. కానీ.. ఆయన ఆరోగ్యం స్థితిపై నాకు సమాచారం ఉంది. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడలేను. ఆయన బాగుండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసి కిమ్​ బాగానే ఉన్నారు.

కిమ్​తో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను అమెరికా అధ్యక్షుడిని కాకపోయి ఉంటే.. ఉత్తర కొరియాతో యుద్ధం జరిగి ఉండేది. "

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి:'అక్టోబర్​ నుంచి అమెరికా ప్రగతి రథం పరుగులు'

ABOUT THE AUTHOR

...view details