తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఈ నెల కాదు.. వచ్చే ఏడాది జనవరిలోనే వ్యాక్సిన్' - US can expect delivery of a vaccine starting in January

అక్టోబర్​లోనే కరోనా టీకా పంపిణీ ప్రారంభమవుతుందన్న ట్రంప్ అంచనాలకు భిన్నంగా అమెరికా వైద్య నిపుణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ పంపిణీ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. సురక్షితమైన టీకా ఉత్పత్తికి తమ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు.

Trump official says vaccine expected starting in January
ఈ నెల కాదు.. వచ్చే ఏడాది జనవరిలోనే వ్యాక్సిన్

By

Published : Oct 10, 2020, 8:50 AM IST

కరోనా వ్యాక్సిన్ జనవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో పనిచేసే అధికారి డాక్టర్ రాబర్ట్ కాడ్లెక్ పేర్కొన్నారు. టీకా పంపిణీ అక్టోబర్​లోనే ప్రారంభమవుతుందని ట్రంప్ ఇదివరకు ప్రకటించిన నేపథ్యంలో రాబర్ట్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

"సురక్షితమైన, సమర్థమంతమైన టీకాను ఉత్పత్తి చేయడానికి మా యంత్రాంగం పనిచేస్తోంది. 2021 జనవరి నాటికి వ్యాక్సిన్​ పంపిణీ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం."

-డాక్టర్ రాబర్ట్ కాడ్లెక్, వైద్య, మానవ సేవల శాఖలో సహాయ కార్యదర్శి

వైద్య, మానవ సేవల(హెచ్​హెచ్​ఎస్) శాఖ సైతం టీకా తయారీపై స్పందించింది. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్​కు అన్ని అనుమతులు లభించినప్పటికీ.. పంపిణీ చేయాలంటే మరింత సమయం పడుతుందని పేర్కొంది.

ఎన్నో విరుద్ధ స్వరాలు!

వ్యాక్సిన్​ వీలైనంత త్వరలోనే వస్తుందని ట్రంప్ తన ఎన్నికల ర్యాలీల్లో చెబుతూ వస్తున్నారు. 'వ్యాక్సిన్​కు రెండు వారాల దూరంలోనే ఉన్నాం' అంటూ అధ్యక్ష అభ్యర్థుల తొలి సంవాదంలో పేర్కొన్నారు. అక్టోబర్​లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని గత నెలలో మీడియా ముందు వెల్లడించారు.

ఇప్పటికే చాలా మంది నిపుణులు, శాస్త్రవేత్తలు ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఎఫ్​డీఏ అనుమతి లేని వ్యాక్సిన్​ డోసులు పది కోట్ల వరకు అందుబాటులో ఉంటాయని హెచ్​హెచ్​ఎస్ కార్యదర్శి అలెక్స్ అజర్ పేర్కొన్నారు.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ సమర్థమో కాదో తెలుస్తుందని, అత్యవసర అనుమతులు పొందడానికి కొన్ని వారాల సమయం పడుతుందని టీకా తయారీ కార్యక్రమంలో పాల్గొన్న డా. మోన్సెఫ్ స్లాయి చెప్పారు.

ముందే రాదని చెప్పలేం!

ఈ విరుద్ధ అంచనాలపై కాడ్లెక్​ను ప్రశ్నించగా.. టీకాను వీలైనంత త్వరగా తీసుకురావడమే ట్రంప్ లక్ష్యమని, దీనికి శ్వేతసౌధం ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. జనవరి కన్నా ముందే వ్యాక్సిన్ రాదని చెప్పడం కూడా సరైనది కాదని అన్నారు.

ఇదీ చూడండి-ట్రంప్ X బైడెన్: కరోనా విషయంలో అబద్ధాలు ఎవరివి?

ABOUT THE AUTHOR

...view details