కరోనా ధాటికి దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు... భారతీయ-అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాల సహకారం తీసుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఇందులో భాగంగా సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), సుందర్ పిచాయ్ (గూగుల్) సహా ఆరుగురు భారతీయ-అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలను 'గ్రేట్ అమెరికన్ ఎనకామిక్ రివైవల్ ఇండస్ట్రీ గ్రూప్స్'లో చేరి సేవలు అందించాలని కోరారు.
అగ్రస్థానాన్ని నెలబెట్టుకునేందుకు...
దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ట్రంప్ 18 గ్రూప్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం వివిధ పరిశ్రమలు, విభాగాల నుంచి సుమారు 200 మంది అగ్రశ్రేణి కార్పొరేట్ దిగ్గజాలను ఆయన ఎంచుకున్నారు. వీరు ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు.
టెక్ గ్రూప్... దిగ్గజాలు
ట్రంప్ ఎంచుకున్న టెక్ దిగ్గజాల్లో... సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్తో పాటు, అరవింద్ కృష్ణ (ఐబీఎం), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్) ఉన్నారు. ఇదే బృందంలో టిమ్ కుక్ (యాపిల్), లారీ ఎల్లిసన్ (ఒరాకిల్), మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్బుక్) కూడా ఉన్నారు.