అమెరికా 'ప్రాధాన్యతల సాధారణ వ్యవస్థ' (జీఎస్పీ) కింద ఇచ్చే హోదాను భారత్, టర్కీకి రద్దుచేయాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ కాంగ్రెస్‌కు ప్రతిపాదించారు. భారతీయ మార్కెట్లో అమెరికాకు సహేతుక, సమాన అవకాశాలు ఇస్తామని మాట ఇవ్వడంలో భారత్ విఫలం కావడమే ఇందుకు కారణమని వివరించారు.
హోదా రద్దు ఆలోచనపై అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి ట్రంప్ లేఖ రాశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే జీఎస్పీ హోదా నుంచి భారత్‌తో పాటు టర్కీని తొలగించాల్సిందిగా కోరారు.
"'జీఎస్పీ' నిబంధనలు అనుసరించి భారతీయ మార్కెట్లో అమెరికాకు నిష్పక్షపాత అవకాశాలు కల్పించే అంశంపై భారత్ నాయకత్వంలతో నేను సంప్రదింపులు కొనసాగిస్తాను."
-స్పీకర్ నాన్సీ పెలోసీకి రాసిన లేఖలో ట్రంప్
మరో ప్రకటనలో 'అమెరికా వాణిజ్య ప్రతినిధి' (యూఎస్టీఆర్) సంస్థ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ట్రంప్ ప్రతిపాదనలు ఆమోదం పొందినా, అవి అమలులోకి రావడానికి మరో 60 రోజుల సమయం ఉంటుందని యూఎస్టీఆర్ తెలిపింది.
ఇప్పటికే చైనాతో వాణిజ్య ఒప్పందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్... భారత్‌పైనా గుర్రుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ రాసిన లేఖ భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం.