అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే 2020 ఎన్నికల్లో నెగ్గేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2016 ఎన్నికల్లో తన సొంతఖర్చుతో బరిలోకి దిగిన ట్రంప్ 2020 ఎన్నికల ప్రచారం కోసం పూర్వ అధ్యక్షుల అడుగుజాడల్లో నడుస్తున్నారు. ప్రజల వద్ద నుంచి నిధులు సమకూర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒక బిలియన్ డాలర్లను సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ రియాలిటీ షో స్టార్ కమ్ వ్యాపారవేత్త. ఈ నిధుల్ని సమకూరిస్తే డెమోక్రాట్లపై ట్రంప్ పైచేయి సాధించినట్టే.
ట్రంప్ మిలియన్ డాలర్లు వసూలు చేసే క్రమంలో ప్రత్యర్థులు ఎక్కువ మొత్తంలో రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే డెమోక్రాటిక్ జాతీయ కమిటీ (డీఎన్సీ) ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉంది.
"డెమోక్రాట్ల అభ్యర్థి ఎవరైనా సరే.. నిధుల కొరత తప్పదు. వారు సున్నా నుంచి ప్రారంభించాలి. ఇప్పటికే డీఎన్సీ అప్పుల్లో కూరుకుపోయింది." -మైకేల్ గ్లాస్నర్, ట్రంప్ ఎన్నికల ప్రచార అధికారి.
ఈ మాసాంతంలోపు మొదటి విడత ఎన్నికల ప్రచారానికి సమకూర్చిన నిధుల లెక్కలను వెలువరించనున్నారు.