సామాజిక మాధ్యమాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ల మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. 8 కోట్ల మంది డిజిటల్ 'సైనికులు' ఉన్న ట్రంప్‌తో కేవలం 64 లక్షల సైన్యంతో 'ట్విట్టర్' రణక్షేత్రంలో తలపడుతున్నారు బైడెన్. ఇదేకాక ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ వీరిద్దరి ఫాలోవర్ల మధ్య అంతరం భారీగా ఉంది.
దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకు సగటున 14 పోస్టులు పెడుతున్నారు. ఆయనకు ఫేస్బుక్లో 28 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్‌కు ఫేస్బుక్లో 2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. సగటున ఏడు పోస్టులు చేస్తున్నారు. ట్విట్టర్లో ట్రంప్ 82.4 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉండగా.. బైడెన్ కేవలం 6.4 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
అంతేగాక గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ సైన్యాన్ని భారీగా పెంచుకున్నారు ట్రంప్. వీరంతా తమ క్యాంపెయిన్ మెసేజ్‌లను వందలసార్లు రీట్వీట్ చేస్తున్నారు. గూగుల్, యూట్యూబ్ ప్రకటనల్లోనూ ట్రంప్ దూసుకెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యేందుకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి మద్దతు ఉండటం ట్రంప్‌నకు కాస్త ఉరటనిచ్చే అంశం. తన మద్దతుదారులతో నిరంతరం సంభాషించడం, నిరుద్యోగం, జాతి వివక్ష, కరోనా విషయంలో తన దుర్బలత్వాన్ని విస్మరించే సందేశమివ్వడానికి ఇది భారీ వేదికలా అధ్యక్షుడికి ఉపయోగపడుతోంది.
ప్రస్తుతం బైడెన్ సైతం తన 'సామాజిక' శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫేస్బుక్ ప్రకటనలపై భారీగా ఖర్చు చేస్తున్నారు. జూన్ నెలలో తొలిసారి ట్రంప్‌తో పోలిస్తే రెట్టింపు డబ్బును ఖర్చుచేశారు. ఇన్స్టాగ్రామ్ మద్దతుదారులను నియమించుకొని ఆన్లైన్ ఫండ్‌రైజింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నూతన సవాళ్లు!
అయితే అధ్యక్షుడికి ప్రస్తుతం కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. సామాజిక సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో అనుచరులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ ట్విట్టర్ వంటి సంస్థల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
"అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ నేత బైడెన్లకు ఇప్పుడు చాలా భిన్నమైన సవాళ్లు ఉన్నాయి. తన అనుచరులను ట్రంప్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బైడెన్ ఇప్పుడు కొత్త ఓటర్లు, మద్దతుదార్లకు తన గురించి తాను పరిచయం చేసుకోవాలి."
-తారా మెక్‌గోవన్, అక్రోనిమ్ ఫౌండర్
సామాజిక మాధ్యమాలన్నీ వ్యతిరేకమే!
ట్రంప్‌కు ట్విట్టర్ వరుస షాకులిస్తోంది. మెయిల్-ఇన్ ఓటింగ్ వల్ల మోసాలు పెరుగుతాయన్న ట్వీట్‌కు ఫ్యాక్ట్‌చెక్ జత చేసింది. ఓ మానిప్యులేటెడ్ వీడియోను పోస్ట్ చేసినందుకు వినియోగదారులను అప్రమత్తం చేసింది. మినియాపొలిస్‌లో లూఠీలు చేసేవారిని కాల్చేస్తామని హెచ్చరించిన ట్వీట్‌ను హైడ్ చేసింది.
ట్రంప్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్ కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫేస్‌బుక్‌పై ప్రభావం పడింది. సంస్థలో నుంచి చాలా కంపెనీలు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల ఫేస్‌బుక్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో నియమాలకు విరుద్ధంగా ట్రంప్ పోస్టులు చేస్తే చర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ ప్రకటించింది.
స్నాప్‌చాట్ సైతం ట్రంప్ ప్రొఫైల్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడి ఖాతాను యాక్టివ్‌గా ఉంచుతూనే ఎక్కువ ప్రదర్శించకుండా ఉంచనున్నట్లు గతనెలలో ప్రకటించింది. విద్వేష ప్రసంగాలు, హింసాత్మక కామెంట్లకు చెక్‌పెడుతూ రెడిట్ సంస్థ ట్రంప్ అనుచరుల ఖాతా 'ది_డొనాల్డ్'ను నిషేధించింది.