అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఫేస్బుక్ అనేక మంది అతివాదులను తన సామాజిక మాధ్యమ వేదికల నుంచి నిషేధించిన నేపథ్యంలో... ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాల పనితీరును 'చాలా దగ్గరగా చూస్తూ, పర్యవేక్షిస్తున్నా' అని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని హింసాత్మక, విద్వేషపూరిత భావజాలం వ్యాప్తి చేస్తున్న కొంత మంది అతివాదులను ఫేస్బుక్ నిషేధించింది. నిషేధిత వ్యక్తుల జాబితాలో లూయిస్ ఫరాఖాన్, అలెక్స్ జోన్స్ తదితరులు ఉన్నారు. వీరిని ప్రమాదకరమైన వ్యక్తులుగానూ ఫేస్బుక్ పేర్కొంది. మరోవైపు వాట్సన్, నటుడు జేమ్స్ వుడ్ ట్విట్టర్ ఖాతాలను నిలిపివేసింది.
పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు..
ఈ పరిణామాలపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు కన్జర్వేటివ్‌లకు వ్యతిరేకంగా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 'సామాజిక మాధ్యమాల్లో అమెరికన్లపై జరుగుతున్న సెన్సార్షిప్ను దగ్గరగా పరిశీలిస్తున్నా' అని ట్రంప్ అన్నారు.
"జేమ్స్వుడ్స్ లాంటి బలమైన, బాధ్యతాయుతమైన కన్జర్వేటివ్ గొంతుకను ట్విట్టర్ నుంచి ఎలా నిషేధిస్తారు? సామాజిక మాధ్యమాలు, తప్పుడు మీడియా వాటి భాగస్వామి డెమోక్రాటిక్ పార్టీలకు వాటికవే సృష్టించుకుంటున్న సమస్యలు ఎక్కడికి దారితీస్తాయో వాటికి తెలియదు. ఇది చాలా అన్యాయం!"- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు