సినిమాల్లో అద్భుతమైన లొకేషన్లు దర్శనమిస్తాయి. ఎత్తైన భవనాలు, వాటి వెనుక అందమైన బ్యాక్గ్రౌండ్లు సర్వ సాధారణం. అవి చూస్తున్న ప్రతిసారీ.. అలాంటి ప్రాంతాల్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయాలని మనకు కూడా అనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్లేసరికి ఫొటోల కోసం భారీ మొత్తం వెచ్చించాల్సి వస్తుంది. అందుకు ప్రత్యామ్నాయాన్ని ఓ యువకుడు కనుగొన్నాడు. ఎత్తైన భవనం, కనుచూపు మేర కనపడే నగర అందాల మధ్య నివాసం ఉంటున్న అతను.. ఫొటోలు దిగేందుకు తన అపార్ట్మెంట్ బాల్కనీని అద్దెకు ఇస్తున్నాడు. అతని ఆలోచన ఇప్పుడు కాసులు కురిపిస్తోంది.
గంటకు 25 డాలర్లు...
టొరంటోలో నివాసముంటున్న 24ఏళ్ల ర్యాన్ అల్రుషుద్.. ఓ అపార్ట్మెంట్లోని 60వ అంతస్తులో నివాసముంటున్నాడు. అంత ఎత్తైన భవనం నుంచి నగరం మొత్తం అత్యంత సుందరంగా కనపడుతుంది. అతనికి ఓ అలోచన వచ్చింది. ఇక తన అపార్ట్మెంట్ బాల్కనీని అద్దెకు పెట్టేశాడు. ఫొటో ప్రేమికులకు ఇది హాట్‌స్పాట్‌గా మారిపోయింది. ర్యాన్ బాల్కనీని ఉపయోగించుకుని అద్భుతమైన ఫొటోలు దిగుతున్నారు ప్రజలు. అవి సామాజిక మాధ్యమాల్లో మంచి లైక్స్ తెచ్చిపెడుతున్నాయి.
తన బాల్కనీని ఫొటోలు దిగేందుకు మోడల్స్‌కు, ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లకు అందుబాటులో ఉంచాడు ర్యాన్. మనిషికి గంటకు 25డాలర్లు వసూలు చేస్తున్నాడు. బాల్కనీతో పాటు బాత్రూం, వైఫై అదనంగా ఇస్తున్నాడు. ఒక్కసారి కేవలం ముగ్గురికే అనుమతి ఉంటుంది.