డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా (Donald Trump) ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికారులు వణికిపోయినట్లు తెలుస్తోంది. ఆయన పదవిలో ఉన్న చివరి రోజుల్లో చైనాపై యుద్ధం (US China War) ప్రకటిస్తారేమోనని ఓ సైనికాధికారి హడలెత్తిపోయారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన జర్నలిస్టులు 'పెరిల్' అనే పుస్తకంలో ప్రస్తావించారు.
పాలన చివరి రోజుల్లో ట్రంప్ ఎలాంటి దూకుడైన నిర్ణయాలు తీసుకుంటారోనని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు ఛైర్మన్‌గా ఉన్న మార్క్ మిలే (Mark Milley) ఆందోళన వ్యక్తం చేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై ముందు జాగ్రత్తగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారి జనరల్ లీ జూవోచెంగ్తో మార్క్.. రెండు సార్లు మాట్లాడారు. ఇరుదేశాల మధ్య యుద్ధం జరగకుండా చూడాలని కోరారు. అధ్యక్ష ఎన్నికల తేదీకి (US election 2020) మూడు రోజుల ముందు(2020 అక్టోబర్ 30) ఓసారి, క్యాపిటల్ హింసాకాండ (Capitol insurrection) జరిగిన రెండు రోజుల తర్వాత మరోసారి చైనా అధికారితో మాట్లాడారు.
"జనరల్ లీ.. అమెరికా ప్రభుత్వం స్థిరంగానే ఉందని మీకు స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇక్కడి ప్రభుత్వం వంద శాతం సుస్థిరంగా కొనసాగుతోంది. కానీ, ప్రజాస్వామ్యం కొన్నిసార్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటుంది. మేము మీపై దాడి చేయబోం. ఒకవేళ చేయాల్సి వస్తే.. ముందుగానే మీకు ఫోన్ చేసి చెప్తా. హెచ్చరికలు లేకుండా ఆకస్మిక దాడులు అయితే జరగవు."
-మార్క్ మిలే, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ మానసికంగా కుంగిపోయారని మిలే భావించినట్లు పుస్తకంలో వివరించారు. అణ్వాయుధ దాడికి ఆదేశిస్తారన్న ఉద్దేశంతో ముందుజాగ్రత్తగా అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. 'జనవరి 8న ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీతో జరిగిన సంభాషణలో.. అణ్వాయుధ దాడికి ఆదేశాలు ఇవ్వకుండా ట్రంప్‌ను అడ్డుకునేలా ఏం చేయగలమనే అంశంపై మిలే చర్చించారు. ఇండో పసిఫిక్ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్న అడ్మిరల్‌కు ఫోన్ చేసి.. సైనిక కార్యక్రమాలు, విన్యాసాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అణుదాడి చేయాలని ట్రంప్ ఆదేశిస్తే.. తనను సంప్రదించాలని కోరారు' అని పుస్తకంలో పేర్కొన్నారు.