Toddler shopping with moms phone: వీడియో గేమ్స్ ఆడుకునేందుకు తల్లి స్మార్ట్‌ఫోన్ తీసుకున్న ఓ 22 నెలల బాలుడు.. పొరపాటున 1700 డాలర్లు(సుమారు లక్షా 27వేల రూపాయలు) విలువైన ఫర్నిచర్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. న్యూజెర్సీలో జరిగిందీ ఘటన.
కొత్త ఇల్లు.. కొత్త సామాను...
ప్రమోద్ కుమార్-మధు.. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు. ఇటీవలే న్యూజెర్సీలో సొంతింటి కల సాకారం చేసుకున్నారు. గృహప్రవేశం కూడా అయింది. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనాలని అనుకుంది మధు. వాల్‌మార్ట్ యాప్‌లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ.. కొన్నింటిని కార్ట్‌లో యాడ్ చేసింది. అయితే.. అన్నీ ఆలోచించుకుని నెమ్మదిగా ఆర్డర్ చేద్దామని అనుకుంది మధు.
Toddler shopping furniture:
అనూహ్యంగా వాల్‌మార్ట్ నుంచి పార్సిల్స్ రావడం మొదలయ్యాయి. ఒకటి, రెండు, మూడు.. అలా వరుసగా డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఏంటా అని యాప్ చూసిన ప్రమోద్-మధుకు అసలు విషయం బోధపడింది. ఇదంతా తమ కుమారుడైన 22 నెలల అయాన్ష్ చేసిన పనేనని అర్థమైంది.
Toddler shopping walmart
"అయాన్ష్ యాప్ ఓపెన్ చేశాడు. కార్ట్‌లో యాడ్ చేసి ఉన్నవాటన్నింటినీ ఆర్డర్ చేశాడు. పేమెంట్స్ అన్నీ పూర్తయిపోయాయి. ముందు ఓ వ్యక్తి ఓ పెట్టె తీసుకువచ్చాడు. ఆ వెంటనే మరొకరు. తర్వాత ఇంకొకరు. ఆర్డర్ చేసిన వాటిలో 75శాతం వస్తువులు ఇప్పటికే డెలివర్ అయిపోయాయి" అని చెప్పాడు ప్రమోద్.
"అందరూ ఇప్పుడు వర్చువల్ ప్రపంచంలోనే ఉంటున్నారు. అయాన్ష్ తోబుట్టువులు కూడా ఎప్పుడూ ఫోన్‌తోనే గడుపుతారు. అందుకే అతడికీ ఫోన్ అంటే చాలా ఇష్టం. కానీ.. ఇకపై ఫోన్‌కు పాస్వర్డ్ పెట్టాలని, క్రెడిట్ కార్డ్ సమాచారం లేకుండా చూడాలని ఈ ఘటనతో నాకు అర్థమైంది" అని అంటున్నాడు ప్రమోద్.
అందుకు ఒప్పుకున్న వాల్‌మార్ట్
అయాన్ష్ వల్ల పొరపాటు జరిగిందంటూ వాల్‌మార్ట్‌ను సంప్రదించారు ప్రమోద్-మధు. వారి అభ్యర్థన పట్ల వాల్‌మార్ట్ సానుకూలంగా స్పందించింది. అవసరం లేని వస్తువులు రిటర్న్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది.
ఇదీ చదవండి:యంగ్‌గా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీ- కళ్లు మూయలేకపోతున్న వృద్ధుడు!