తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా కట్టడికి చతుర్ముఖ వ్యూహం! - క్వాడ్ భేటీపై చైనా స్పంద

భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా​ దేశాధినేతలు తొలిసారి శుక్రవారం క్వాడ్ కూటమి సదస్సులో పాల్గొనున్నారు. కరోనా తర్వాత అంతర్జాతీయంగా చైనాపై వ్యతిరేకత వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ భేటీ జరుగుతోంది. దీనితో ఈ సమావేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

The main purpose of the quad meeting
క్వాడ్ భేటీ ఒప్పందాలతో చైనాకు చెక్​

By

Published : Mar 11, 2021, 7:41 PM IST

చతుర్భుజ కూటమి(క్వాడ్) సదస్సులో.. శుక్రవారం తొలిసారి భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాల అధినేతలు పాల్గొననున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాళ్లు కరోనాపై పోరు, ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పు అంశాలపై చర్చించనున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా, ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ క్వాడ్‌ సదస్సులో వర్చువల్​గా ఈ భేటీలో పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో ఇండో పసిఫిక్​ ప్రాంతంలో చైనా దూకుడు, ఆ దేశ సైనిక, ఆర్థిక శక్తి దుర్వినియోగాన్ని కట్టడి చేసే అంశంపైనా దేశాధినేతలు చర్చించనున్నారు. ఇందుకోసం వ్యూహాత్మక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశముందని తెలుస్తోంది.

తొలిసారి ఉన్నత స్థాయి నేతల భేటీ..

2004 సునామీ అనంతరం క్వాడ్‌ కూటమి ఏర్పాటైంది. 2007 నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి విదేశాంగ మంత్రుల స్థాయిల్లో తరచూ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే నాలుగు దేశాల అగ్రనేతలు భేటీలో పాల్గొనడం మాత్రం ఇదే ప్రథమం. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ పగ్గాలు చేపట్టాక.. క్వాడ్​ వంటి బహుపాక్షిక సమావేశంలో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి.

కరోనా టీకాపై కీలక నిర్ణయం..

నాలుగు దేశాల అగ్రనేతల పాల్గొననున్న తొలి భేటీలో కరోనా వ్యాక్సిన్​పై అత్యంత కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలనున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా టీకా ప్రక్రియ వేగవంతం చేసేందుకు కృషి చేసే అంశం కూడా ఈ భేటీలో చర్చకు రానున్నట్లు తెలిపారు.

ఈ దేశాలు భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ శక్తిని పెంచి ప్రపంచ దేశాలను ఆదుకోవాలని భావిస్తున్నాయని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఇటీవల పేర్కొన్నారు. ఇందులో భాగంగా అమెరికా ఔషధ సంస్థలైన నోవావ్యాక్స్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు భారత్‌ సంస్థలు టీకాలు తయారు చేసేలా ఒప్పందం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

దృఢ నిశ్చయంతోనే..

క్వాడ్​ కూటమి ఏర్పాటైనప్పటి నుంచి నాలుగు దేశాలు మౌలిక వసతులు సహా ఇతర సాధారణ అంశాలపై మాత్రమే చర్చించుకునేవి. అయితే కరోనా వల్ల 12 నెలల కాలంలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీనితో నాటకీయంగా కూటమిలోని దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రముఖ అంతర్జాతీయ పరిణామాల విశ్లేషకులు ప్రొఫెసర్ హర్ష్​ వీ పంత్​ 'ఈటీవీ భారత్​'తో అన్నారు.

"ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని, మారుతున్న పరిణామల్ని కూటమి దేశాలు చాలా కాలంగా గమనిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని తీవ్రంగా పరిగణించాలని, చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు కలిసి పనిచేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తొలిసారి నాలుగు దేశాల అధినేతలు భేటీలో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది."

-ప్రొఫెసర్​ హర్ష్​ వీ పంత్

'ఈటీవీ భారత్​'తో ప్రొఫెసర్ హర్ష్​ వీ పంత్

క్వాడ్ భేటీపై చైనా స్పందన

శుక్రవారం జరగనున్న క్వాడ్ దేశాల సదస్సుపై చైనా స్పందించింది. కూటమిలోని నాలుగు దేశాది నేతల తొలి భేటీ చర్చ ఓ ప్రాంతంపై వ్యతిరేకతను పెంచే విధంగా కాకుండా.. ప్రాంతీయ శాంతి, సామరస్యాలను పెంపొందించేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఏ ప్రాంతీయ కూటమైనా శాంతి, ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర సహకారం పెంపొందించే విధంగా పని చేయాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చాలా కాలంగా ఇదే పద్ధతి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

కరోనా వ్యాక్సిన్​తో చైనా చేస్తున్న దౌత్యానికి అడ్డుకట్టే వేసే విధంగా క్వాడ్​ సదస్సులో ఒప్పందం కుదిరే అవకాశముందనే అంశంపైనా ఆయన స్పందించారు. అంతర్జాతీయంగా వ్యాక్సిన్​ సహకారానికి చైనా కట్టుబడి ఉందన్నారు. వ్యాక్సిన్​తో రాజకీయం చేయడానికి తాము వ్యతిరేకమని చెప్పుకొచ్చారు.

అయితే చైనా ఎదుగుదలను అడ్డుకునేందుకే క్వాడ్​ కూటమి శిఖరాగ్ర భేటీ జరగనున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్​ టైమ్స్ ఓ కథనాన్ని రాసుకొచ్చింది. ఇండో పసిఫిక్​ ప్రాంతంపై అమెరికా పట్టు సాధించడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశమని కూడా అందులో పేర్కొంది.

ఇదీ చదవండి:'హక్కుల ఉల్లంఘనపై చైనాను నిలదీయడం ఖాయం'

ABOUT THE AUTHOR

...view details