కరోనా ఎఫెక్ట్: సరిహద్దుల మూసివేత కరోనా దెబ్బకు ప్రపంచమంతా ఆంక్షల వలయంలో బిగుసుకుపోతోంది! వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను పలు దేశాలు ఇప్పటికే సరిహద్దులను మూసివేయగా, తాజాగా మరికొన్ని దేశాలు ఆ జాబితాలో చేరాయి. ఐరోపా నుంచి ప్రయాణికుల రాకపై ఇటీవల నిషేధాజ్ఞలు విధించిన అమెరికా.. వాటిని బ్రిటన్, ఐర్లండ్‌లకూ విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. న్యూజెర్సీలో ఏకంగా కర్ఫ్యూ విధించారు.
డెన్మార్క్ తమ సరిహద్దులను మూసివేసింది. తమ పౌరులు మినహా ఇతరులెవర్నీ దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా కూడా సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించాయి. నార్వే, పోలండ్‌లతో సరిహద్దుల నుంచి తమ దేశంలోకి విదేశీయుల రాకను అడ్డుకుంటామని రష్యా ప్రకటించింది. ఫిలిప్పీన్స్‌లో రాజధాని మనీలా నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా.. నగరానికి ఎవరూ రాకుండా నిషేధం విధించారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు, థియేటర్లను మూసివేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది.
స్పెయిన్‌లో ఆందోళనకరం
స్పెయిన్‌లో కరోనా ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. వైరస్ బాధితుల సంఖ్య 7,753కి చేరింది. మృతుల సంఖ్య 288కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 100 మందికి పైగా చనిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనితో ఆహారం, ఔషధాల వంటి అత్యవసరాల కోసం తప్ప ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ ఇటలీ తరహాలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ భార్య గొమెజ్‌కు వైరస్ సోకింది.
ఇరాన్‌లో కోలుకున్న 4,590 మంది
ఇరాన్‌లో కరోనా మృతుల సంఖ్య 724కు పెరిగింది. వైరస్ సోకినవారి సంఖ్య 13,938గా నమోదైంది. వారిలో 4,590 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారవర్గాలు ప్రకటించాయి. మరోవైపు కొవిడ్-19 తీవ్రతకు మరణించినవారి సంఖ్య ఇటలీలో 1400, అమెరికాలో 60 దాటింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1,59,844 మందికి వైరస్ సోకిందని.. మృతుల సంఖ్య 6,036కు పెరిగిందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి:ఆ దేశంలో కరోనా అడుగుపెట్టలేదు.. ఎందుకో తెలుసా?