పదునైన వ్యాఖ్యలతో పాకిస్థాన్‌కు ఐరాస వేదికగా దిమ్మతిరిగిపోయే బదులిచ్చింది మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన స్నేహా దూబే(Sneha Dubey). పాక్ తీరును ఎండగట్టి వాస్తవాలను బయటపెట్టిన ఈమె వైఖరి ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చూపులకు బక్కపల్చగా ఉన్నా.. ఘాటుగా ఇచ్చిన ఆమె సమాధానం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాంతో ఈ స్నేహా దూబే(Sneha Dubey) ఎవరు? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు..! ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆమె వివరాలు చూద్దామా?
స్నేహా దూబే(Sneha Dubey).. చిన్నవయసు నుంచే దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు. వ్యాపార రంగంలో ఉన్న ఆమె తండ్రి, పాఠశాల ఉపాధ్యాయురాలైన ఆమె తల్లి అందుకు బాటలు వేశారు. అందుకు తగ్గట్టే గోవాలో పాఠశాల చదువును పూర్తి చేశారు. పుణెలో కళాశాల విద్య, ఆ తర్వాత దిల్లీ జేఎన్‌యూ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. అది కూడా తన లక్ష్యానికి తగినట్టుగా అంతర్జాతీయ అంశాలపైనే పరిశోధన చేశారు. ఈ క్రమంలోనే సివిల్స్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌గా ఎంపికయ్యారు. 2012 బ్యాచ్‌కు చెందిన దూబే మొదటి పోస్టింగ్ విదేశాంగ శాఖలో. ఆ తర్వాత 2014లో స్పెయిన్‌లోని భారత దౌత్యకార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్‌కు తన సమాధానంతో గట్టి షాక్ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తోన్న నేతల మానసిక స్థితి ఏంటో.. అంటూ జాలి వ్యక్తం చేశారు.
"పాకిస్థాన్.. తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకొంటోంది.. కానీ ఆ దేశం ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంది.. అమెరికా జంట భవనాలపై ఉగ్రదాడికి పాల్పడిన ఒసామా బిన్‌లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది.. తనవైపు ఇన్ని తప్పులు పెట్టుకొని అంతర్జాతీయ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది"