భూమిపై నిల్చొని ఆకాశాన్ని అందరూ చూడగలరు... కానీ ఆకాశంలోకి వెళ్లి భూమిని చూడాలనే కోరిక అందరికీ ఉన్నా.. అది నెరవేరేది అతి కొద్దిమంది విషయంలోనే! తాజాగా అలాంటి అరుదైన అవకాశం దక్కించుకుంది శిరీషా బండ్ల. భారత సంతతి, అందులోనూ తెలుగు మూలాలున్న ఆమె చిన్నప్పటి నుంచి నింగిలోకి వెళ్లాలని కలలు కనేదట! ఇప్పుడు ఆ కలను సాకారం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ స్పేస్ ఫ్లైట్ సంస్థ 'వర్జిన్ గెలాక్టిక్' అంతరిక్ష నౌకలో శిరీష కూడా రోదసీయాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి తెలుగు మహిళగా ఖ్యాతి గడించిందీ సూపర్ ఉమన్.
ఆరుగురిలో ఆమె!
కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్... అంతరిక్షంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన భారతీయ వనితలు. ప్రస్తుతం శిరీష పేరు కూడా ఈ జాబితాలోకి చేరింది. అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తమ అంతరిక్ష నౌకను ఇవాళ నింగిలోకి పంపింది. ఇప్పటికే మూడుసార్లు స్పేస్‌ఫ్లైట్లను ఆకాశంలోకి పంపిన ఈ సంస్థ.. ఈ నాలుగో ప్రయోగంలో భాగంగా తొలిసారి మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. న్యూ మెక్సికో నుంచి బయలుదేరిన ఈ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా మొత్తం ఆరుగురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లారు. వీరిలో ఇద్దరు పైలట్లు, ఆ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు అదే సంస్థకు చెందిన మరో ముగ్గురు ప్రతినిధులున్నారు. అందులో భారతీయ సంతతికి చెందిన శిరీష కూడా ఉంది. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి(ప్రభుత్వ వ్యవహారాలు) హోదాలో ఆమె ఈ అంతరిక్షయానం చేశారు.
లెక్కలంటే ఇష్టం!
తమ మానవ సహిత అంతరిక్ష యానానికి శిరీష ఎంపికైందని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రకటించగానే ఆమె స్వస్థలం గుంటూరు జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. శిరీష తల్లిదండ్రులు అనూరాధ, మురళీధర్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వాస్తవ్యులు. శిరీష పుట్టాక కుటుంబమంతా అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం వీరు వాషింగ్టన్‌లో నివాసముంటున్నారు. ఇక చిన్నప్పటి నుంచే ఆస్ట్రోనాట్ కావాలని కలలు కన్న శిరీషకు గణితమన్నా మహా ఇష్టమట! అక్కడి Purdue యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె.. ఆపై జార్జిటౌన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా అందుకుంది. చదువు పూర్తయ్యాక కమర్షియల్ స్పేస్‌ఫ్లైట్ ఫెడరేషన్ (CSF)లో ఇంటర్న్‌షిప్ (Space Policy Job) చేసింది. అయితే అంతకంటే ముందు టెక్సాస్‌లోని గ్రీన్‌విల్లేలో ఉన్న ఎల్-3 టెక్నాలజీస్ (గతంలో దీన్ని ఎల్ -3 కమ్యూనికేషన్స్‌గా పిలిచేవారు) అనే ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించింది. ఈ క్రమంలో అధునాతన విమాన భాగాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిందామె. ఇక 2017 నుంచి 'వర్జిన్ గెలాక్టిక్' సంస్థలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతోన్న ఆమె.. అదే హోదాలో అంతరిక్షంలోకి అడుగుపెట్టి తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది.
సేవలోనూ ముందే!