అమెరికాలో మరోసారి కాల్పులు చెలరేగాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించారు.
కొలరాడోలో పుట్టినరోజు పార్టీ జరుగుతుండగా ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మరణించారు. కాల్పుల తర్వాత నిందితుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు.
నిందితుడు.. పార్టీకి హాజరైన వారిలో ఓ యువతి బాయ్ఫ్రెండేనని పోలీసులు తెలిపారు. ఆ యువతితో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ పార్టీలో చిన్నారులు కూడా ఉన్నారని, అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
వెంబడించి మరీ కాల్పులు
మరోవైపు, మేరీలాండ్‌లో ఓ వ్యక్తి తన ఇరుగుపొరుగువారిపై దాడికి తెగబడ్డాడు. అనంతరం తన ఇంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. నిందితుడిని పోలీసులు మట్టుబెట్టారు.
నిందితుడు కాల్పులతో పాటు కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. తొలుత.. పక్కింట్లోకి వెళ్లి ఓ మహిళ(41)ను తుపాకీతో కాల్చి, కత్తితో పొడిచి చంపేశాడని పోలీసులు వెల్లడించారు. ఆ ఇంట్లోని మరో మహిళ పారిపోయేందుకు ప్రయత్నించగా.. వెంబడించి మరీ హతమార్చాడని తెలిపారు. తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన మరో ఇద్దరిపైనా కాల్పులు జరిపాడని, అందులో ఒకరు చికిత్స పొందుతూ మరణించగా.. మరొకరు కోలుకుంటున్నాడని స్పష్టం చేశారు.
వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడి ఇంటిని చుట్టుముట్టినట్లు వివరించారు. అతడు లొంగకపోవడం వల్ల కాల్పులు చేసినట్లు వెల్లడించారు. నాలుగు బుల్లెట్లు శరీరంలోకి దిగిన అతడిని.. అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చనిపోయాడు. మరణించక ముందు అతడి ఇంటికి స్వయంగా నిప్పంటించుకున్నాడని పోలీసులు తెలిపారు.
నిందితుడికి చెందిన రెండు వాహనాల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఓ హ్యాండ్‌గన్, పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ హింసకు పాల్పడేందుకు గల కారణాలు తెలియలేదు.
ఇదీ చదవండి:'2015లోనే కరోనాతో జీవాయుధాల తయారీలో చైనా'