యావత్ ప్రపంచం కొవిడ్-19పై యుద్ధాన్ని ప్రకటించాయి. వారాల తరబడి తమని తాము ఇంట్లోనే నిర్బంధించుకొని భౌతికదూరం అనే అస్త్రంతో కరోనాపై రణం చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఎక్కడిక్కడ వాణిజ్యం, వ్యాపారాలు నిలిచిపోయి ఆర్థికపరమైన సవాళ్లు ప్రపంచదేశాల ముందు నిలిచాయి. ఈ పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం చేస్తూ ముందుకు సాగుతూ ఆర్థిక వ్యవస్థని కాపాడుకుందామంటూ.. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పరిశోధకులు మాత్రం మరోసారి కరోనా విజృంభించే అవకాశాలు లేకపోలేదని.. ఆ విజృంభణ ఊహకైనా అందనంత విలయం సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో..
అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా వ్యాప్తితో పాటు మరణాల రేటు కూడా అధికంగా ఉంది. అయినప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడం కోసం లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాయి. వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నాయి. అగ్రరాజ్యం వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో వైరస్ వ్యాప్తి సహా.. మరణాలూ అధికంగానే ఉన్నాయి. అయితే న్యూయార్క్ వెలుపల గ్రామాల్లో కూడా అధికంగా ఉందని.. న్యూయార్క్ నీడలో వాటికి అంత ప్రాధాన్యం లేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికీ వైరస్ తమను వదల్లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాన్సాస్‌లోని షావ్‌నీ కౌంటీ వైద్యాధికారి చెప్పారు.
ఆర్థిక వ్యవస్థమీదే ధ్యాస
అమెరికాలో కరోనాతో 71 వేలకు పైగా మరణాలు సంభవించగా 12 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడమే ఏకైక ధ్యేయంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్.. లాక్ డౌన్ సడలింపులకు ప్రాధాన్యం ఇవ్వడం సహా ఆర్థిక వ్యవస్థమీదే దృష్టిసారిస్తున్నారు. గడచిన రెండు నెలల వ్యవధిలో అమెరికాలో దాదాపు 3 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ.. వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ సృష్టించిన బీభత్సంపై అందరూ చర్చించుకుంటున్నారు. నాడు రెండోసారి స్పానిష్ ఫ్లూ పుట్టుకురాగా.. అప్పుడు అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో సమావేశాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో విజృంభించిన ఫ్లూ.. మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది.
నిపుణులు ఏమంటున్నారంటే?
కొవిడ్ ధాటికి ఐరోపా కకావికలమైంది. ఆ ఖండంలోని అన్ని దేశాలూ ఆ మహమ్మారి బారినపడ్డాయి. తొలుత ఇటలీలో మొదలైన మరణమృదంగం.. తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్ సహా ఇప్పుడు బ్రిటన్‌లో మృత్యుఘంటికలు మోగించింది. ఈ క్రమంలో ఇటలీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంపై ప్రభుత్వాధినేతలను శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త బాధితులను గుర్తించి వైరస్ మరోసారి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్తగా వచ్చే కేసులు గుర్తించేందుకు శిక్షణ అవసరమని అందుకోసం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని ఇటలీ సర్కార్‌కి విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా దేశాలు యాప్‌లను రూపొందించుకొని సాంకేతికత సాయంతో కరోనాని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నాయని.. అది మాత్రమే మరోసారి వైరస్ విజృంభించకుండా అడ్డుకోవడానికి సరిపోదని ఇటలీ నిపుణులు అంటున్నారు.