ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం కోట్లాది ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం వ్యాక్సిన్‌ను ఆమోదించినట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తీసుకొచ్చిన మొదటి దేశంగా రష్యా చరిత్రకెక్కింది.
రష్యా ప్రకటనపై ఎవరూ ఆశ్చర్యం కానీ, విస్మయాన్ని వ్యక్తం చేయలేదు. ఎందుకంటే 1957లోనే రోదసిలోకి తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహాన్ని పంపిన దేశమది. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో శాస్త్రీయత, భద్రతకు సంబంధించి కొంతమంది సందేహాలు లేవనెత్తారు. అయితే ఈ వ్యాక్సిన్ రేసులో రష్యా విజయం సాధించినట్లేనా? ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలు ఎలా ఉన్నాయో చూద్దాం.
పుతిన్ రాజకీయ లబ్ధి?
అయితే అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయంగా ఉన్న పోటీ తరహాలోనే తొలి వ్యాక్సిన్‌పైనా ఊహాగానాలు సాగాయి. అంతర్జాతీయంగా రాజకీయ ప్రత్యర్థులతోపాటు శాస్త్రీయ పోటీతత్వం ఇక్కడ గమనించాల్సిన విషయం. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అందించే తొలిదేశం.. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విజయం సాధించటంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంటుందన్నది వాస్తవం.
ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు, కరోనా వైరస్ వ్యాప్తితో రష్యాలో ఆదరణ తగ్గుతోన్న పుతిన్‌కు ఈ విజయం చాలా అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు.
"కరోనాకు వ్యాక్సిన్ తీసుకురావటంలో రష్యా విజయం నిజమైనదే. మొదటి నుంచి చెబుతున్నట్టే ఇందులో పైచేయి సాధించింది. రష్యా ప్రభుత్వానికి ఈ అంశం చాలా లాభదాయకం."
- తిమోతీ ఫ్రై, రాజనీతి శాస్త్రం ఆచార్యుడు, కొలంబియా విశ్వవిద్యాలయం
రష్యా ఒంటరి కాదు..
వ్యాక్సిన్ రేసులో రష్యా మాత్రమే ఒంటరిగా లేదు. వైరస్ వ్యాప్తి మొదలైన చైనా కూడా వ్యాక్సిన్ తయారీలో పురోగతికి తీవ్రంగా కృషి చేస్తోంది. చైనాకు చెందిన ఓ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే తన ఉద్యోగులపై టీకా ప్రయోగించినట్టు ప్రకటించింది.
ట్రంప్ భవితవ్యం..
అమెరికాలో కరోనా విజృంభణ రాజకీయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యాన్ని సందిగ్ధంలోకి నెట్టింది. దీన్ని చక్కబెట్టుకునేందుకు వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించారు ట్రంప్. ఎన్నికలకు ముందు వ్యాక్సిన్ ప్రకటనతో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు.
ఆయన ఆశలకు అనుగుణంగా నవంబర్ ఎన్నికలకు ముందుగానే అందుబాటులోకి తీసుకొచ్చేలా ఓ వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. అయితే టీకా పోటీలో ట్రంప్‌ను పుతిన్ ఓడించారా అన్నది ఇప్పుడే స్పష్టంగా అంచనా వేయలేం. ఎందుకంటే.. ప్రయోగాలకు సంబంధించి రష్యా ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు.
ఇంత వేగంగా ఎలా?
వ్యాక్సిన్ సురక్షితమైనదేనని చెప్పేందుకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని రష్యాలోని శాస్త్రవేత్తలే అంటున్నారు. విదేశీ నిపుణులదీ అదే మాట. "వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందని చెప్పేందుకు ఇది చాలా తక్కువ సమయం" అని సౌథాంప్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు డాక్టర్ మైఖేల్ హెడ్ అభిప్రాయపడ్డారు.
రష్యా ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్‌కు అవసరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఆమోదించినట్లు చెబుతోంది. ఈ ప్రయోగాల్లో తన కుమార్తె కూడా పాల్గొన్నారని, ఆమె ఆరోగ్యంగా ఉన్నారని పుతిన్ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్‌ను ఈ నెలలో తొలుత వైద్యులకు అందించి.. అనంతరం అక్టోబర్‌లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రష్యా అధికారులు వెల్లడించారు.
తేలికగా కొట్టిపారేయలేం..
రష్యా విజయాన్ని ఇంత తేలికగా కొట్టిపారేయడం తొందరపాటే అవుతుంది. సహజ వనరుల ఎగుమతులతో ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న దేశమిది. శాస్త్ర సాంకేతికం, అంతరిక్షం, వైద్య రంగాల్లో ఎన్నో అపూర్వ విజయాలు సాధించింది. 1961లో అంతరిక్షంలోకి తొలిసారిగా మానవుడిని పంపిన ఘనత రష్యాకు ఉంది.
రష్యాకు వ్యాక్సిన్‌ను తయారు చేసే సామర్థ్యం ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ సమాచారాన్ని రష్యా హ్యాక్ చేసిందని అమెరికా, బ్రిటన్, కెనడా ఆరోపణలను ఉద్దేశించి.. ఆ దేశానికి ఇది సాయం చేసి ఉండవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్న వ్యాక్సిన్ రావటం స్వాగతించాల్సిన విషయమని ఇంకొంతమంది అంటున్నారు.
రష్యా వ్యాక్సిన్ ప్రకటన పుతిన్ స్వలాభం కోసమేనా అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. రష్యాలోనూ ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. అయితే రష్యా వ్యాక్సిన్ విఫలమైతే పుతిన్ రాజకీయ జీవితంలో అతిపెద్ద మచ్చగా మిగులుతుందనేది కాదనలేని నిజం!
ఇదీ చూడండి:రష్యా 'కరోనా వ్యాక్సిన్' ఎంత సురక్షితం?