తెలంగాణ

telangana

ETV Bharat / international

'రిచ్'​ రోదసి ప్రయాణం సాగనుంది ఇలా..

అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వర్జిన్ గెలాక్టిన్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్​ రోదసీయానానికి సిద్ధమయ్యారు. ఆదివారం మరో ఐదుగురు వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించనున్నారు. తెలుగు మూలాలున్న బండ్ల శిరీష కూడా ఇదే బృందంలో సభ్యురాలిగా ఉన్నారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న భారతీయ వనితగా శిరీష ఖ్యాతినార్జించనున్నారు.

Richard branson
రిచర్డ్​ బ్రాన్సన్​

By

Published : Jul 11, 2021, 6:35 AM IST

Updated : Jul 11, 2021, 8:31 AM IST

అంతరిక్ష పర్యటకాన్ని సామాన్యుడికి అందించే లక్ష్యంతో వ‌ర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచ‌ర్డ్ బ్రాన్సన్​ రోదసిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం వర్జిన్ గెలక్టిక్ స్పేస్ క్రాప్ట్‌లో మరో ఐదుగురు వ్యోమగాములతో ఆయన అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఈ బృందంలో తెలుగు మూలాలున్న బండ్ల శిరీష కూడా ఉన్నారు. వ‌ర్జిన్ గెలాక్టిక్‌లో కంపెనీ వ్యవహారాలు, రీసెర్చ్ ఆప‌రేష‌న్‌ల వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన శిరీష.. స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ప్రయాణం సాగుతుందిలా..

అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ 17ఏళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. కొన్ని ప్రయోగాలు విఫలమైనా అంతిమంగా రోదసిలోకి వెళ్లే సాంకేతికతను ఒడిసి పట్టింది. ఇప్పటికే మూడుసార్లు స్పేస్‌ ఫ్లైట్లను ఆకాశంలోకి పంపిన ఈ సంస్థ నాలుగో ప్రయోగంలో భాగంగా తొలిసారి మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. న్యూ మెక్సికో నుంచి బయలుదేరే ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా మొత్తం ఆరుగురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

'రిచ్'​ రోదసి ప్రయాణం సాగనుంది ఇలా..

ఆ ఆరుగురు వీరే..

  • రిచర్డ్​ బ్రాన్సన్​- వర్జిన్​ గెలాక్టిక్​ వ్యవస్థాపకుడు
  • బెత్​ మాసెస్​- వర్జిన్​ గెలాక్టిక్​ చీఫ్​ ఆస్ట్రోనాట్​ ఇన్​స్ట్రక్టర్​
  • కోలిన్​ బెన్నెత్​- లీడ్​ ఆపరేషన్స్​ ఇంజినీర్​
  • శిరీష బండ్ల- గెలాక్టిక్​ ఉపాధ్యక్షురాలు
  • డేవ్​ మక్​కే- ఎయిర్​క్రాఫ్ట్​ పైలట్​
  • మైఖల్​ మసూచీ- ఎయిర్​క్రాఫ్ట్​ పైలట్​

భూమి నుంచి స్పేస్ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు వర్జిన్ గెలాక్టిక్ ప్రత్యేకంగా ఓ ప్లేన్ క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది. ఈ కేరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లాక దాని నుంచి స్పేస్ ఫ్లైట్‌ వేరుపడుతుంది. క్యారియర్‌ నుంచి వేరు పడే సమయంలో స్పేస్ ఫ్లైట్ కూడా రాకెట్‌‌‌‌‌‌‌‌లానే నిప్పులు చిమ్ముతూ పైకి దూసుకెళ్తుంది. నిర్దేశిత ఎత్తుకు చేరుకున్నాక నిలువుగా వెళ్లే ఫ్లైట్ అడ్డంగా మారుతుంది. ఆ సమయంలో ఇంజిన్ ఆఫ్ అవుతుంది. అక్కడ దానిలోని వ్యోమగాములు జీరో గ్రావిటీ అనుభూతిని పొందుతారు. కొంత సమయం అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది.

ఆస్ట్రోనాట్​ 001..

అంతరిక్షంలోకి వెళ్లే బృందంలో తన పేరును ఆస్ట్రోనాట్‌ జీరో జీరో వన్‌గా ప్రకటించుకున్న బ్రాన్సన్​ .. ప్రభుత్వాలకు వీలుకాని లక్ష్యాన్ని తాము చేరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అంతరిక్ష పర్యటకాన్ని పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అరుదైన అవకాశం దక్కించుకునేందుకు ఇప్పటివరకు 600 మంది పేర్లు నమోదుచేసుకున్నట్లు తెలిపారు. టికెట్‌ ధరను 2లక్షల 50 వేల డాలర్లుగా వర్జిన్ సంస్థ నిర్ణయించింది. భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఔత్సాహికుల నుంచి పోటీ పెరిగితే ధర పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు అమెజాన్ వ్యవస్థాపకుడు జేఫ్ బెజోస్‌, రిచ‌ర్డ్ బ్రాన్సన్​ మధ్య స్పేస్‌ వార్‌ తీవ్రమైనట్లు అంతరిక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్షాన్ని పర్యటక కేంద్రంగా మార్చేందుకు ఇరువురు పోటీ పడుతున్నట్లు విశ్లేషించారు. జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యానానికి 9రోజుల ముందే బ్రాన్సన్​ రోదసిలోకి వెళ్లనున్నారు. జెఫ్‌ బెజోస్‌ ఈనెల 20న అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు.

ఇదీ చూడండి:-'రిచ్' రోదసి​ ప్రయాణానికి రంగం సిద్ధం

Last Updated : Jul 11, 2021, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details