ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో గతనెల 215మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కెనడావ్యాప్తంగా మూసివున్న రెసిడెన్షియల్ స్కూళ్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కొవెస్సెస్ ఫస్ట్ నేషన్ ప్రాంతంలోని మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో రాడార్ ద్వారా అన్వేషించగా వందలకొద్దీ సమాధులు బయటపడ్డాయి. 600మందికి పైగా చిన్నారులను సమాధి చేసినట్లు భావిస్తున్న అధికారులు తవ్వకాల ద్వారా పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో నడిచింది.
6వేల మంది..
19వ శతాబ్దం నుంచి 1970ల వరకు కెనడాలో లక్షన్నర మందికిపైగా చిన్నారులను క్రిస్టియన్ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు తెలిసింది. ఈ పాఠశాలల్లో అత్యధికం.. రోమన్ కాథలిక్ మిషనరీ ఆధ్వర్యంలోనే నడిచేవి. ఒకప్పుడు ఇక్కడి పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవనీ, మాటవినని వారిని తీవ్రంగా కొట్టేవారనీ చెబుతారు. చిన్నారులపై శారీరక, లైంగిక వేధింపులు జరిగేవని, మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను చితకబాదేవారని ఇటీవల కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్ల కనీసం 6వేల మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా.