విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాలు కఠినంగా వ్యవహరిస్తుంటాయి. అయితే, ఇన్నాళ్లూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో సంయమనం పాటించాయి. అధ్యక్ష హోదాలో ఉన్న ఆయన్ను చాలాసార్లు మౌనంగానే భరించాయి ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సంస్థలు. అవే వ్యాఖ్యలు సాధారణ పౌరులు చేసుంటే.. ఖాతాలు తొలగించేవి. కానీ, ట్రంప్ ఖాతాలకు 'వార్నింగ్ లేబుల్'తోనే సరిపెట్టాయి.
జనవరి 20 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా ట్రంప్ పదవీకాలం ముగిశాక.. బైడెన్ అధ్యక్ష పీఠం అధిరోహించాక.. భారీగా ఫాలోవర్లు ఉన్న హై-ప్రొఫైల్ ట్రంప్ ఖాతాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల సంస్థలు ఎలా వ్యవహరించనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ ట్వీట్లకు ఎందుకన్ని లేబుల్లు ?
అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు వెలువడుతున్నపుడు మొదటి నుంచి.. ట్రంప్ ఓటమివైపుగా పయనించారు. అయితే, తనదే గెలుపంటూ ఒకసారి, ఎన్నికలు అక్రమమంటూ మరోసారి, బైడెన్‌ను గెలిపించేందుకు అందరూ కలిసి కుట్ర చేశారంటూ ఇంకోసారి.. నిరాధార ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారం ఇస్తోన్న ట్రంప్ పోస్టులకు.. ట్యాగ్లు జతచేశాయి సోషల్ మీడియా సంస్థలు.
అయితే.. ట్రంప్ ట్వీట్లకు మాత్రమే కాదు.. 'సివిక్ ఇంటిగ్రిటీ' విధానం కింద చాలామంది ట్వీట్లకు లేబుల్ చేర్చారు. తప్పుడు సమాచారం ఇస్తోన్న పోస్ట్‌లపై కఠినంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో అసత్య వార్తలను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరగేందుకు ఈ విధంగా వ్యవహరించారు.
ఎన్నికల రోజు నుంచి దాదాపు 100కు పైగా ట్రంప్ ట్వీట్లకు, రీట్వీట్లకు... 'సరికాదు', 'అధికార సమాచారం వేరు' అంటూ లేబుళ్లు అంటించింది ట్విట్టర్. కింద వచ్చిన లింక్‌ను క్లిక్ చేస్తే.. అధికార సమాచారం పొందే విధంగా ఏర్పాట్లు చేసింది. అంతకుముందెన్నడూ ఇలా జరిగిన దాఖలాలు లేవు. ఫేస్బుక్ సైతం ఇలానే వ్యవహరించింది.
చెరో దారిలో ఫేస్బుక్, ట్విట్టర్?
ఎన్నికలపై ట్రంప్ వ్యాఖ్యలకు తప్పంటూ ముద్ర వేసేందుకు ఇరు సంస్థలు ఒకానొక దశలో పోటీపడ్డాయి. అయితే, ఈ వ్యాఖ్యలు విస్తృతం కాకుండా చూసేందుకు ట్విట్టర్ కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంది.
ఫేస్బుక్ కాస్త ముందుగానే బైడెన్ విజేత అంటూ యూజర్లకు వెల్లడించగా.. ట్విట్టర్ కాస్త ఆచితూచి అడుగులేసింది. అయితే, ఈ లేబుల్ జతచేసిన వ్యాఖ్యలను షేర్, రీట్వీట్ చేసేందుకు సదరు సంస్థలు చిన్న హెచ్చరికతోనే అనుమతించాయి.