ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యనంతరం ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రజలు శాంతి స్థాపన కోసం రోడ్డుకెక్కారు. ఇరాన్, ఇరాక్‌లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వాషింగ్టన్‌లోని సియాటెల్ పట్టణంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ట్రంప్ చేపడుతున్న చర్యలు యుద్ధాన్ని ఉసిగొల్పే విధంగా ఉన్నాయని నిరసనకారులు ఆరోపించారు. "యుద్ధం వద్దు" అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు.
యుద్ధం వద్దంటూ రోడ్డెక్కిన అమెరికా ప్రజలు యుద్ధ భయాలు...
ఇరాన్‌తో తలెత్తిన ఉద్రిక్తతల మధ్య ఇప్పుడు అదనంగా 2,900 మంది సైన్యాన్ని ఆ దేశ పరిసరాల్లోకి అమెరికా పంపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సులేమానీని చంపినందుకు ప్రతీకార చర్యగా అమెరికాపై మరోసారి దాడి చేసినట్లయితే తీవ్ర ప్రతిఘటన చర్యలు ఉంటాయని ట్రంప్ ఇదివరకే ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది.
మరోవైపు ఇరాన్లో జనరల్ ఖాసిం సులేమానీపై జరిగిన డ్రోన్ దాడికి సంబంధించి కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్)లో అధికారిక ప్రకటన ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా సైనిక దాడి చేపట్టిన 48 గంటలలోగా కాంగ్రెస్‌లో అధికారిక నోటిఫికేషన్ జారీ చేయాలి.