అమెరికా.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం. ఇతర ఏ దేశానికీ లేనటువంటి అత్యాధునిక సాంకేతికత, సాటిలేని రక్షణ వ్యవస్థ అమెరికాకు సొంతం. అందుకే ఆ దేశాన్ని ప్రపంచానికి అగ్రరాజ్యంగా పరిగణిస్తారు. మరి అలాంటి దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అన్ని రంగాల్లోనూ సాటిలేని సంపత్తిని కలిగి ఉన్నందున వారిని ప్రపంచానికి పెద్దన్నగా, రారాజుగా ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటాము.
అయితే ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, ఉగ్రవాదం, ప్రజా ఆరోగ్యం వంటి ఎన్నో సమస్యలు పలువురు అమెరికా అధ్యక్షులనూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఉడ్రో విల్సన్, ఫ్రాంక్లిన్ డీ రూజ్ వెల్ట్, జార్జ్ డబ్ల్యూ బుష్ దగ్గర్నుంచి బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ వరకు చాలామంది అధ్యక్షులు ఈ జాబితాలో ఉన్నవారే. వీరిలో కొందరు ప్రమాదాన్ని ముందే గమనించి సత్వర చర్యలు తీసుకుంటే.. మరికొందరేమో ప్రమాదాల నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో చాకచక్యంగా వ్యవహరించలేకపోతున్నారని చరిత్రకారులు భావిస్తున్నారు. మరి వీరందరికీ ఎదురైన సవాళ్లేమిటో గమనిస్తే..
ఉడ్రో విల్సన్
1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకున్న సమయంలో స్పానిష్ ఫ్లూ వైరస్.. భూగోళంపై భీకరస్థాయిలో విరుచుకుపడింది. ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ఈ వైరస్‌కు అమెరికన్లూ అతీతమేమీ కాలేదు. అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఉన్న ఉడ్రో విల్సన్ సహా వేలాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. దాదాపు 6,75,000 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఫ్లూ వైరస్ కంటే మొదటి ప్రపంచయుద్ధం ముగింపుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టినందున విల్సన్.. వైరస్ పై విజయం సాధించలేదన్నది చరిత్రకారుల మాట.
జార్జ్ డబ్ల్యూ బుష్
2001లో జార్జ్ డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇస్లామిక్ ఉగ్ర సంస్థ ఆల్ ఖైదా.. 9/11 దాడులకు తెగించింది. ఈ దాడుల్లో 2,977 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోగా 25వేల మంది గాయపడ్డారు. ఆ తర్వాత దాడులపై స్పందించిన బుష్.. ఈ మారణహోమానికి కారణమైనవారు అతి త్వరలోనే మన సమాధానాన్ని వింటారని ప్రతినబూనారు.