తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రకృతి కోసం మోదీతో ఒబామా దోస్తానా..! - ప్రధాని

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి మంచి స్నేహం ఉన్నట్లు ఎన్నో సార్లు రుజువైంది. 2015లో భారత గణతంత్ర సంబారాలకు ముఖ్య అతిథిగా ఒబామా విచ్చేశారు. అయితే అతి తక్కువ వ్యవధిలో మోదీ- ఒబామాకి స్నేహం కుదరడానికి గల కారణమేంటి? తాజాగా ఒబామా సలహాదారు ఈ విషయాన్ని బయటపెట్టారు.

ప్రకృతి కోసం మోదీతో ఒబామా దోస్తానా..!

By

Published : May 7, 2019, 8:16 PM IST

బరాక్​ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అగ్రదేశానికి, భారత్​కు మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. 2015లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకులకు ముఖ్య అతిథిగా ఒబామా హాజరయ్యారు. భారత్​కు రెండు సార్లు విచ్చేసిన ఏకైక అమెరికా అధ్యక్షుడు ఒబామాయే కావడం విశేషం.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఒబామా స్నేహం చేయడానికి ఓ బలమైన కారణముందని ఆయన హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న బెంజమిన్​ రోడ్స్​ తెలియజేశారు.

మోదీ- ఒబామా ఆలింగనం

2014 చివరిలో అప్పటి ఒబామా ప్రభుత్వానికి చైనాకి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేలా చర్యలు చేపట్టాలి. ఈ పరిణామంతో ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి అడుగులు పడ్డాయి.

ప్రపంచంలోనే ఎక్కువ శాతం ఉద్గారాలు వెలువరించే చైనా, అమెరికా ఒప్పందం చేసుకోవడం వల్ల ఇతర దేశాలు ప్యారిస్​ ఒప్పందానికి ఒక్కొక్కటిగా అంగీకారం తెలిపాయి. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే అప్పటికి భారత్​ ప్యారిస్​ ఒప్పందానికి అంగీకారం తెలపకపోవడం.

ఒబామా చొరవ...

ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి భారత్​ను ఒప్పించడానికి ఒబామా తెలివిగా వ్యవహరించారని రోడ్స్​ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో భారత గణతంత్ర దినోత్సవానికి అతిథిగా రావాలని ఒబామాకు మోదీ ఆహ్వానం పలికారు.

భారత్​కు అమెరికా అధ్యక్షుడు వచ్చేముందు స్టేట్​ ఆఫ్​ యూనియన్​ అడ్రస్​ (ఎస్​ఓటీయూ)కు తెలపాలి. ఒబామా ముఖ్య సలహాదారులు మోదీ ఆహ్వానాన్ని సమ్మతించాలని సూచించారు. ఎందుకంటే ప్యారిస్​ ఒప్పందం కుదరాలంటే భారత్​ను అందుకు ఒప్పించాలి. భారత్​ ఒప్పుకోవాలంటే మోదీతో సన్నిహితంగా మెలగాలని వారు ఒబామాకు సలహా ఇచ్చారు.

ప్యారిస్​లో​ భారత బృందానికి ఒబామాకు మధ్య సుమారు అరగంట చర్చ జరిగింది. ఎంతకూ చర్చ కొలిక్కిరావడం లేదు. ఆ సమయంలో మోదీ అక్కడకు వచ్చారు. 'భారత్​లో 30 కోట్ల మంది ఇప్పటికీ విద్యుత్​ లేక అంధకారంలో జీవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మీరు నన్ను బొగ్గు వినియోగించ రాదు, ఒప్పందానికి ఒప్పుకోండి అంటే ఎలా?' అంటూ అభ్యంతరం తెలిపారు.

ఎన్నడూ లేని విధంగా ఆ సందర్భంలో ఒబామా తన జాతి గురించి ప్రస్తావించారని రోడ్స్​ తెలిపారు. 'నల్లజాతీయుడిగా పుట్టినప్పటికీ అమెరికాకు అధ్యక్షుణ్ని కాగలగిగాను. పరిస్థితులను అర్థం చేసుకోగలను. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ స్థాయికి చేరుకునే వాడిని కాదు' అని ఒబామా అన్నారు.

మోదీ చెప్పిన విద్యుత్ సమస్యకు ఒబామా పరిష్కారం చూపారు. భారత్​లో​ సౌర విద్యుత్​ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అమెరికా ప్రణాళికలను మోదీకి వివరించారు. ఇంకేముంది మోదీ ప్యారిస్​ ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు.

మోదీతో ఒబామా మంచి స్నేహాన్ని పెంచుకున్నారు. తద్వారా భారత్​తో పాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్​ను ప్యారిస్​ ఒప్పందానికి అంగీకరించేలా చేయగలిగారు.

ఇదీ చూడండి: ప్రియాంక దుర్యోధనుడి కథకు 'అర్జునుడి' కౌంటర్

ABOUT THE AUTHOR

...view details