అమెరికాలో కరోనా మరణాలు దాదాపు లక్షకు చేరువయ్యాయి. ఈ సందర్భంగా 'ద న్యూయార్క్ టైమ్స్' తన వార్తాపత్రిక తొలి పేజీని కరోనాతో మృతి చెందిన వారికి కేటాయించింది.
"యూఎస్ మరణాలు లక్షకు చేరువయ్యాయి, ఇది తీరని నష్టం" అనే శీర్షికతో బాధితుల పేర్లను ప్రచురించింది. ఉపశీర్షికలో "వారు జాబితాలోని పేర్లు మాత్రమే కాదు, మనలో ఒకరు" అని పేర్కొంది.
మృతుల పేర్లు, సంక్షిప్త వివరణలతో మొత్తం ఆరు కాలమ్స్ నిండిపోయాయి. మరణాల తీవ్రతను తెలిపేందుకు చేసిన ప్రయత్నంలో.. సాధారణ కథనాలు, ఫొటోలు, గ్రాఫిక్స్ ఉండే స్థలం మొత్తాన్ని ఈ జాబితా ఆక్రమించేసిందని గ్రాఫిక్స్ డెస్క్ అసిస్టెండ్ ఎడిటర్ సిమోన్ తెలిపారు.
తన 40 ఏళ్ల వృత్తి జీవితంలో ఎలాంటి ఫొటోలు లేకుండా తొలి పేజీని ప్రచురించలేదని పేర్కొన్నారు ద టైమ్స్ సీఈఓ టామ్ బోడ్కిన్. కేవలం గ్రాఫిక్స్‌తో ప్రచురించిన సందర్భాలు ఉన్నాయన్నారు.