తెలంగాణ

telangana

ETV Bharat / international

రోదసిలోకి దూసుకెళ్లిన నాసా పర్సీవరెన్స్​ రోవర్‌ - america latest news

అంగారక గ్రహంపై పరిశోధనల కోసం పర్సీవరెన్స్‌ మార్స్‌ రోవర్‌ను నింగిలోకి పంపింది అగ్రరాజ్యం అమెరికా. యూఏఈ, చైనాలు ఇప్పటికే ఈ ప్రయోగాన్ని ప్రారంభించాయి. ప్రాచీన జీవజాతి మనుగడపై అన్వేషణే లక్ష్యంగా సాగుతోంది ఈ మిషన్​.

NASA's Mars mission blasts off from Florida
రోదసిలోకి దూసుకెళ్లిన నాసా పర్సీవరెన్స్​ రోవర్‌

By

Published : Jul 30, 2020, 6:13 PM IST

అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంగారకుడిపై పరిశోధనల కోసం పర్సీవరెన్స్‌ మార్స్‌ రోవర్​ను నింగిలోకి పంపింది నాసా. ఈ వేసవిలో మూడో ప్రయోగంతో పాటు చివరిది కూడా ఇదే. చైనా, యూఏఈ దేశాలు ఈ మిషన్​ను గతవారమే ప్రారంభించాయి.

7 నెలల సుదీర్ఘ ప్రయాణం అనంతరం దాదాపు 300 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుకోనుంది నాసా అంతరిక్ష నౌక.

జెజెరో ప్రాంతంలో..

అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేందుకు.. అత్యధిక అవకాశం ఉన్న ప్రాంతాన్ని రోవర్‌ దిగేందుకు ఎంపిక చేశారు. ఈ రోవర్ అంగారకుడిపై జెజెరో అనే ప్రాంతంలో దిగబోతోంది. ఇక్కడ కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం.. దాదాపు కొల్లేరు సరస్సుకు ఎనిమిది రెట్ల వైశాల్యం ఉన్న సరస్సు ఉండేదని, అది కొన్ని నదులకు నీరు అందించేదని, గత పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు అంచనాకు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో డెల్టా తరహాలో డిపాజిట్లు ఉండడం వలన ఇక్కడ జీవ అవశేషాలు దొరకవచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో పర్సీవరెన్స్‌ రోవర్‌ నమూనాలు సేకరించి భద్రంగా ఉంచుతుంది. వాటిని భూమికి తీసుకువచ్చి ఇక్కడి ల్యాబ్స్‌లో పరిశోధన చేయాలని యోచిస్తున్నారు.

నాలుగు లక్ష్యాలు..

నాసా ఈ మిషన్‌కు.. నాలుగు లక్ష్యాలను నిర్దేశించింది. అంగారక గ్రహంపై గతంలో జీవం పుట్టడానికి, పరిణామం చెందడానికి గల అనువైన వాతావరణ పరిస్థితుల్ని పరిశోధించడం. అంగారకుడిపై గతంలో జీవించిన సూక్ష్మజీవుల ఆనవాళ్లను సేకరించడం. ప్రత్యేకంగా రాళ్లలో ఉన్న అవశేషాలను వెలికి తీయడం. ఇందుకోసం అక్కడి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భద్రపరుస్తారు.

అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తిని పరీక్షించడం కూడా ఈ మిషన్‌లో భాగమేనని నాసా వెల్లడించింది.

రోబో హెలికాప్టర్​

ఈ పర్సీవరెన్స్‌ రోవర్‌తో పాటు.. ఇంజ్యూనిటీ అనే డ్రోన్‌ మాదిరి ఉండే చిన్న హెలికాప్టర్‌ను పంపుతున్నారు. భూవాతావరణం కన్నా ఒక్క శాతం మందంగా ఉండే అంగారక గ్రహం వాతావరణంలో ఈ రోబో హెలికాప్టర్ ఎగరనుంది. సాంకేతిక పరంగా.. సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు ఈ హెలికాప్టర్​ను పంపుతున్నారు.

పర్సీవరెన్స్‌ రోవర్‌లో 7 సాంకేతిక పరికరాలు, 2 మైకులు, 23 కెమెరాలు ఉంటాయి. వీటిని 4 దేశాలు తయారు చేశాయి.

ఇదీ చూడండి: మార్స్​ యాత్రకు వెళ్లే రోవర్​ విశేషాలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details