పరిశోధనలతోనే కాదు.. వ్యవహార శైలితోనూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. తాజాగా అంతరిక్షంలోకి పర్యటకులను పంపించాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించనుంది. 2020 నుంచి అంతరిక్ష కేంద్రంలోకిఔత్సాహికపర్యటకులను అనుమతించనుంది. ఈ పర్యటన ద్వారా వచ్చే ధనాన్ని అంతరిక్ష కేంద్రానికి ఖర్చు చేసేందుకు సంకల్పించింది.
ఇందులో సంవత్సరానికి రెండు పర్యటనలుంటాయి. ఒక్కో పర్యటన 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఏటా 12మంది అంతరిక్ష కేంద్రంలో గడపవచ్చు. ఒక్కో పర్యటకుడు ఒక రాత్రికి 35వేల అమెరికన్ డాలర్ల (సుమారు 25 లక్షలు) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వారి సొంత ఖర్చులు మినహాయింపు. భోజనం, మంచినీళ్లు వంటివి తమ సొంత ఖర్చుతోనే కొనుగోలు చేయాలి. పర్యటకులను అంతరిక్ష కేంద్రానికి చేర్చేందుకు రెండు అంతరిక్ష నౌకలను సిద్ధం చేస్తోంది నాసా. ఒకటి స్పేస్ ఎక్స్ కాగా మరొకటి బోయింగ్.
"వాణిజ్య అవకాశాల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించుకునేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఇంతకు ముందెప్పుడు లేని విధంగా నాసా ఈ నిర్ణయం తీసుకుంది."