చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపాలని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. అంగారకుడి అవతలికి ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ప్రైవేటు సంస్థలు ఉత్సుకత చూపుతున్నాయి. దీంతో సుదూర విశ్వంలోకి వెళ్లే ఈ వ్యోమనౌకలతో కమ్యూనికేషన్ (Space communication) సాగించడం కీలకంగా మారింది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి సరికొత్త ప్రయోగానికి అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' నడుం బిగించింది. విశ్వంలో కమ్యూనికేషన్లను వేగవంతం చేసేందుకు.. వచ్చే నెల 4న 'లేజర్ కమ్యూనికేషన్స్ రిలే డిమోన్‌స్ట్రేషన్' (ఎల్‌సీఆర్‌డీ) (NASA laser communication) సాధనాన్ని ప్రయోగించనుంది.
ఎందుకు?
ఇతర గ్రహాల వద్దకు వెళ్లే వ్యోమనౌకలతో సంబంధాలను సాగించడానికి ప్రపంచవ్యాప్తంగా రోదసి సంస్థలు రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లను (Laser vs radio frequency) ఉపయోగిస్తున్నాయి. ఇందులో రేడియో తరంగాల ద్వారా సమాచార బట్వాడా జరుగుతోంది.
- అయితే ఆధునిక వ్యోమనౌకల నుంచి భారీగా డేటా వెలువడుతోంది. దీన్ని అందుకోవడానికి మరింత సమర్థమైన కమ్యూనికేషన్ మాధ్యమం అవసరమైంది.
- ఈ నేపథ్యంలో ఆప్టికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ తెరపైకి వచ్చింది. ఇది రేడియో తరంగాల కన్నా వేగవంతమైంది.
ఏమిటీ ఎల్‌సీఆర్‌డీ?
- అమెరికా రక్షణ శాఖకు చెందిన స్పేస్‌టెస్ట్ ప్రోగ్రామ్ శాటిలైట్-6లో భాగంగా ఎల్‌సీఆర్‌డీ పరికరాన్ని భూ అనువర్తిత కక్ష్యలోకి ప్రయోగిస్తున్నారు. ఆప్టికల్ కమ్యూనికేషన్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
- ఇది.. కంటికి కనిపించని పరారుణ లేజర్ల సాయంతో డేటాను పంపడం, అందుకోవడం చేస్తుంది. విశ్వంలో సమాచార బట్వాడాకు పూర్తిస్థాయిలో లేజర్ వ్యవస్థను వాడటం ఇదే మొదటిసారి.
వాస్తవ లేజర్లను ప్రయోగించడానికి ముందు ఇంజినీర్లు.. భూ కేంద్రాల నుంచి ప్రయోగాత్మకంగా డేటాను పంపే విధానాన్ని అభ్యసిస్తారు. ఇందులో భాగంగా డేటాను రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాల ద్వారా కక్ష్యలోకి పంపుతారు. ఎల్‌సీఆర్‌డీ.. వాటిని అందుకుని ఆప్టికల్ సంకేతాల ద్వారా బదులిస్తుంది. తర్వాతి దశలో రోదసిలోని వ్యోమనౌకలు.. ఎల్‌సీఆర్‌డీకి తమ డేటాను పంపుతాయి. దాన్ని భూమిపై ఉన్న నిర్దేశిత కేంద్రానికి ఈ సాధనం బట్వాడా చేస్తుంది. సెకనుకు 1.2 గిగాబిట్ల వేగంతో ఇది పనిచేస్తుంది. సంప్రదాయ రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థతో పోలిస్తే ఇది 10 నుంచి వంద రెట్లు ఎక్కువ బ్యాండ్ విడ్త్‌ను అందిస్తుంది.