అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ... నాసా చంద్రునిపై మరోమారు కాలుమోపే అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. 2024ను తుదిగడువుగా నిర్దేశించుకుంది. అయితే.. ఇందుకు భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయని లెక్కగట్టింది నాసా.
ఈ ప్రయోగం ద్వారా తొలిసారి మహిళా వ్యోమగామితో చంద్రునిపై అడుగుపెట్టించే ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. నిర్దేశించుకున్న లక్ష్యానికి చంద్రుడ్ని చేరాలంటే.. ప్రయోగ నిర్వహణకు స్థలం, అంతరిక్ష నౌకలకోసం అదనంగా 1.6 బిలియన్ డాలర్లు అవసరమని తెలిపారు నాసా కార్యనిర్వాహకుడు జిమ్ బ్రిడెన్స్టయిన్. అయితే... మొత్తం ప్రయోగ వ్యయం ఎంత అన్న ప్రశ్నను దాటవేశారు.
'ఇది అదనపు పెట్టుబడి. 2024 నాటికి జాబిలిపై మానవులు కాలుమోపే ఈ ప్రయోగానికి పెట్టుబడి సరిపోయే విధంగా లేదు. ఇదే నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.'
- జిమ్ బ్రిడెన్స్టయిన్, నాసా కార్యనిర్వాహకుడు
నాసా వార్షిక బడ్జెట్ దాదాపు 21.5 బిలియన్ డాలర్లు. 2019 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అయితే.. నాసా నిర్దేశిత గడువులోగా లక్ష్యాన్ని సాధించదనే ఆందోళనలో ఉన్నారు అమెరికా చట్టసభ్యులు, నిపుణులు. స్పేస్ లాంఛ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో ఆలస్యం చేయడాన్ని ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.