Oldest aquarium fish: అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో మ్యూజియంలో ఓ అరుదైన అక్వేరియం చేప జీవిస్తోంది. ఈ లంగ్ఫిష్ వయసు దాదాపు 90 ఏళ్లు. పొడవు 4 అడుగులు. బరువు 40 పౌండ్లు. 1938లో ఆస్ట్రేలియా నుంచి దీన్ని అమెరికాకు తీసుకొచ్చారు. అప్పటికే దాని వయసు 6 సంవత్సరాలు.
ఈ చేపకు మెతుసెలా అని పేరు పెట్టారు. అందుకు ఓ ప్రత్యేక కారణమే ఉంది. బైబిల్లో మెతుసెలా అనే వ్యక్తి 969 సంవత్సరాలు జీవించినట్లు ఉంది. అ పాత్ర స్ఫూర్తితోనే చేపకు ఈ పేరు పెట్టారు. అయితే బైబిల్లో మెతుసెలాలా మరీ 9 శతాబ్దాలు జీవించకపోయినా... 9 దశాబ్దాలుగా జీవిస్తోంది ఈ చేప. ప్రపంచంలోని అక్వేరియం చేపల్లో ఇదే అతిపెద్దది(వయసులో) కావడం గమనార్హం.
మెతుసెలాకు ముందు మరో ఆస్ట్రేలియన్ లంగ్ఫిష్ చికాగాలోని షెడ్ అక్వేరియంలో జీవించి ఉండేది. అయితే అది 95ఏళ్ల వయసులో 2017లో చనిపోయింది.
మెతుసెలా ఆడ చేప అని దాని సంరక్షకులు భావిస్తున్నారు. రక్తాన్ని పరీక్షించకుండా దాని లింగాన్ని అంచనా వేయలేం. అయితే మెతుసెలా మొప్పలను పరీక్షకు పంపి అది ఆడా? లేక మగా? నిర్ధరించనున్నట్లు సంరక్షకులు తెలిపారు. దీని వల్ల చేప వయసెంతో కచ్ఛితమైన అంచనాకు కూడా రావచ్చన్నారు.