డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ మరో కీలక రాష్ట్రం మిషిగన్‌లో విజయం సాధించారు. ఈ గెలుపుతో బైడెన్ అధ్యక్ష పీఠమెక్కేందుకు కావాల్సిన మెజారిటీ దిశగా అడగులు వేస్తున్నారు.
అధ్యక్ష పీఠం దిశగా బైడెన్- కీలక రాష్ట్రాలు కైవసం - అమెరికా ఓట్ల లెక్కింపు
03:52 November 05
03:02 November 05
శ్వేతసౌధం వద్ద నిరసనలు...
అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ వేళ శ్వేతసౌధం బయట నిరసనలు జరుగుతున్నాయి. ట్రంప్, బైడెన్ మద్దతుదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 'బ్లాక్ లైవ్స్ మేటర్' నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
01:16 November 05
ట్రంప్ యోచన...
బైడెన్ గెలుపొందిన విస్కాన్సిన్ రాష్ట్రంలో ఓట్లను పునర్లెక్కించాలని ట్రంప్ బృందం కోరనుంది. ఇక్కడ ఇరువురి మధ్య పోరు హోరాహోరిగా సాగింది. 2016లో కూడా ఈ రాష్ట్రంలో ట్రంప్ ఒక పాయింట్ కన్నా తక్కువ మార్జిన్లో ఓడిపోయారు.
00:50 November 05
కీలకంగా ఉన్న విస్కాన్సిన్ రాష్ట్రంలో జో బైడెన్ గెలుపొందారు. ఈ రాష్ట్రంలో 11 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్‌కు దక్కాయి. ప్రస్తుతం బైడెన్ మేజిక్ ఫిగర్ 270కి చేరువవుతున్నారు.
19:57 November 04
మిషిగన్‌లో బైడెన్ ఆధిక్యం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ దూసుకెళ్తున్నారు. తొలి నుంచి ట్రంప్ ఆధిక్యంలో ఉన్న కీలక స్థానం మిషిగన్‌లో బైడెన్ ముందంజ వేశారు. దాదాపు 10 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే బైడెన్ నెవాడా, విస్కాన్సిన్లో లీడ్‌లో ఉన్నారు. ఈ 3 స్థానాల్లో నెగ్గితే.. బైడెన్‌కు 270 ఎలక్టోరల్ ఓట్లు వచ్చి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు అవకాశం కలుగుతుంది.
19:56 November 04
మరింత ఆలస్యం..
- మరింత ఆలస్యం కానున్న అమెరికా ఎన్నికల ఫలితాలు
- ఈ నెల 12 తర్వాతే రానున్న నార్త్ కరోలైనా (15) ఫలితం
- నార్త్ కరోలైనాలో ఈ నెల 12 వరకు మెయిల్ బ్యాలెట్ల స్వీకరణ
- నార్త్ కరోలైనాలో ప్రస్తుతం 7 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్న ట్రంప్
- అలాస్కా (3)లో మరో వారంపాటు కొనసాగనున్న కౌంటింగ్
- పెన్సిల్వేనియా (20)లో గురువారం సాయంత్రానికి ఫలితం వచ్చే అవకాశం
- జార్జియా (16) ఫలితం గురువారం ఉదయానికి వచ్చే అవకాశం
- జార్జియాలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్న ట్రంప్
18:57 November 04
నెవాడాలో కౌంటింగ్ నిలిపివేత
- నెవాడా రాష్ట్రంలో కౌంటింగ్ నిలిపివేత
- నెవాడాలో ఫలితం మరింత ఆలస్యమయ్యే అవకాశం
- ప్రస్తుతానికి ఒకటి కంటే తక్కువ శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్న బైడెన్
- నెవాడా(4)లో ఫలితంపై ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ
17:57 November 04
270 ఎవరిదో...?
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, విపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. ఇప్పటివరకు 41 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడగా.. బైడెన్224 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ట్రంప్ 213 ఓట్లు కైవసం చేసుకున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు... 270 గెలిచిన అభ్యర్థినే అధ్యక్ష పీఠం వరిస్తుంది.
17:40 November 04
కౌంటింగ్ నిలిపివేత..
- జార్జియాలో కౌంటింగ్ నిలిపివేసిన అధికారులు
- జార్జియాలో మరో 4 గంటల తర్వాత మళ్లీ లెక్కింపు
- జార్జియాలో 92 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి
- జార్జియాలో ఇంకా లెక్కించాల్సిన లక్షా 27 వేల ఓట్లు
- జార్జియాలో ట్రంప్‌నకు ఇప్పటివరకు లక్ష ఓట్ల మెజారిటీ
17:36 November 04
హోరాహోరీ..
- మిషిగన్ రాష్ట్రంలో ట్రంప్, బైడెన్ హోరాహోరీ
- మిషిగన్‌లో ట్రంప్‌నకు కేవలం 1.4 శాతం ఆధిక్యం
- మిషిగన్‌లో ఇంకా లెక్కించాల్సిన 10 లక్షల డెట్రాయిట్ ఓట్లు
- డెమొక్రాట్లకు బాగా పట్టున్న ప్రాంతం డెట్రాయిట్
- మిషిగన్ (16) ఫలితంపై రెండు పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ
17:23 November 04
భారత సంతతి నేత కులకర్ణి ఓటమి..
అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసిన భారత సంతతి నేత, డెమొక్రాట్ అభ్యర్థి శ్రీ ప్రిస్టన్ కులకర్ణి ఓటమిపాలయ్యారు. టెక్సాస్‌లోని 22వ జిల్లాలో పోటీ చేసిన ఆయన.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రోయ్ నెహల్స్ చేతిలో పరాజయం చెందారు. నెహల్స్ 52 శాతం ఓట్లు(2,04,537) సంపాదించుకోగా.. కులకర్ణికి 44 శాతం ఓట్లు(1,75,738) లభించాయి.
16:44 November 04
స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ హవా..
స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే కీలక రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ తన హవా నిరూపించుకున్నారు. టెక్సాస్‌లో 38, ఫ్లోరిడాలో 29, ఒహియోలో 18 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. 11 చొప్పున ఎలక్టోరల్ ఓట్లు ఉన్న టెన్నెసీ, ఇండియానాలు ఆయనకే జై కొట్టాయి. 10 స్థానాలున్న మిస్సోరి, తొమ్మిది చొప్పున ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అలబామా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపొందింది. 8చొప్పున స్థానాలు ఉన్న కెంటకీ, లూసియానా, 7 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఓక్లహోమాలో ట్రంప్ జయభేరి మోగించారు.
నెబ్రాస్కాలో ఐదు స్థానాలు ఉండగా నాలుగు స్థానాలు ట్రంప్‌నకు దక్కాయి. అక్కడి నిబంధనల ప్రకారం మెజార్టీ సాధించిన అభ్యర్థికి రెండు స్థానాలు వెళతాయి.అవికాకుండా నెబ్రాస్కాలోని మూడు కాంగ్రెస్‌నల్ జిల్లాల్లోని మూడు స్థానాల్లో ఎవరు గెలిస్తే వారికి.... 3 దక్కుతాయి. ఆ మూడు జిల్లాల్లో రెండు చోట్ల ట్రంప్, ఒకచోట బైడెన్ గెలిచారు. ఫలితంగా నెబ్రాస్కాలోని ఐదు ఓట్లలో నాలుగు ట్రంప్‌నకు, ఒకటి బైడెన్‌కు దక్కాయి. ఇక ఫలితాలు రావాల్సిన పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్, నార్త్ కరోలైనా, ఆలస్కాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 70ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.
కాలిఫోర్నియాలో బైడెన్...
అమెరికాలోనే అత్యధికంగా 55 ఎలక్టోరల్ స్థానాలున్న కాలిఫోర్నియా.. బైడెన్ ఖాతాలోకి చేరింది. 29 స్థానాలున్న న్యూయార్క్ 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఇల్లినోస్, 14 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న న్యూజెర్సీల్లో బైడెన్ గెలిచారు. 13 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న వర్జీనియా, 12 ఓట్లు ఉన్న వాషింగ్టన్, 11 చొప్పున ఎలక్టోరల్ ఓట్లున్న ఆరిజోనా, మాసాచుసెట్స్, 10 చొప్పున ఎలక్టోరల్ ఓట్లున్న మిన్నసోటా, మేరీలాండ్‌ల్లో బైడెన్ గెలిచారు. 9 ఓట్లు ఉన్న కొలరాడో, ఏడేసి స్థానాలు ఉన్న కనెక్టికట్, ఓరెగన్‌లలో బైడెన్‌కే విజయం సాధించారు. న్యూమెక్సికో, న్యూహాంప్‌షైర్, రోడ్ ఐలండ్, డీసీ, వెర్మాంట్, డెలవెర్, హవాయిలలో డెమొక్రటిక్ అభ్యర్థి గెలిచారు. నెవెడా, మెయిన్, ఆరిజోనా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో.. 31 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.
15:42 November 04
హోరాహోరీ
- అమెరికా అధ్యక్ష ఫలితాల్లో ట్రంప్, బైడెన్ హోరాహోరీ
- ఇప్పటివరకు బైడెన్‌కు 224, ట్రంప్‌నకు 213 ఎలక్టోరల్ ఓట్లు
- 7 రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలు: పెన్సిల్వేనియా (20), జార్జియా (16), మిషిగన్ (16), నార్త్ కరోలైనా (15), అలాస్కా (3)
- నెవాడా (6), విస్కాన్సిన్ (10)లో ఆధిక్యంలో బైడెన్
15:33 November 04
ట్రంప్ ట్వీట్
- అతిపెద్ద విజయం సాధించబోతున్నామని ట్రంప్ ట్వీట్
- ట్రంప్ ట్వీట్ తప్పుదోవ పట్టించేలా ఉందన్న ట్విట్టర్
- ట్రంప్ ట్వీట్‌పై హెచ్చరిక ఫ్లాగ్ పెట్టిన ట్విట్టర్ సంస్థ
15:27 November 04
బెడెన్ 224.. ట్రంప్ 213
ఇప్పటివరకు 41 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడగా బైడెన్ 224 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ట్రంప్ 213 ఓట్లు కైవసం చేసుకున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు 270 ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన అభ్యర్థినే.... అధ్యక్ష పీఠం వరిస్తుంది.
15:18 November 04
నెబ్రాస్కాకు ప్రత్యేక నిబంధనలు..
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెబ్రాస్కాకు ప్రత్యేక నిబంధనలు
- నెబ్రాస్కా రాష్ట్రంలో మొత్తం 5 ఎలక్టోరల్ ఓట్లు
- మెజారిటీ సాధించిన ట్రంప్‌నకు దక్కిన 2 ఎలక్టోరల్ ఓట్లు
- నెబ్రాస్కా రాష్ట్రంలో అదనంగా 3 కాంగ్రెస్‌నల్ జిల్లాలు
- 3 కాంగ్రెస్‌నల్ జిల్లాల్లో ట్రంప్ 2, బైడెన్ ఒకచోట విజయం
- నెబ్రాస్కాలోని 5 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్‌నకు 4, బైడెన్‌కు ఒక స్థానం
15:15 November 04
బైడెన్ 224.. ట్రంప్ 213
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు జో బైడెన్ 224, ట్రంప్ 213 చోట్ల గెలుపొందారు.
14:54 November 04
బైడెన్ క్లీన్‌స్వీప్..
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పటివరకు ఆయనకు దాదాపు 93శాతం పాపులర్ ఓట్లు లభించాయి. ట్రంప్‌నకు కేవలం 5.6శాతం మాత్రమే వచ్చాయి. 6లక్షలకు పైగా జనాభా కలిగిన డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో బైడెన్ 2లక్షలకు పైగా పాపులర్ ఓట్లు సాధించారు. ట్రంప్ కేవలం 12వేల పైచిలుకు పాపులర్ ఓట్లు మాత్రమే పొందగలిగారు. అయితే, చిన్న నగరం కావడంతో ఇక్కడ ఎలక్టోరల్ ఓట్లు 3 మాత్రమే ఉన్నాయి. నగరంలో ఉన్న మూడు ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ కైవసం చేసుకున్నారు.
14:51 November 04
మరో 10 రాష్ట్రాల్లో తేలితేనే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు 40 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడగా.. బైడెన్ 220 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ట్రంప్ 213 ఓట్లు కైవసం చేసుకున్నారు. మరో పది రాష్ట్రాల్లో ఫలితాలు రావాల్సి ఉండగా ఆరింటిలో ట్రంప్, నాలుగింటిలో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో 80 ఎలక్టోరల్ ఓట్లు ఉంటే, బైడెన్ ఆధిక్యంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో 21 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు270 ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన అభ్యర్థినే అధ్యక్ష పీఠం వరిస్తుంది.
14:46 November 04
ఆ రాష్ట్రాల్లో ట్రంప్ దూకుడు..
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను.. కలిగిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. కీలక రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్న ట్రంప్.. అక్కడ గెలిస్తే మళ్లీ అధికారం నిలబెట్టుకునే అవకాశముంది.
మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను 270 ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన అభ్యర్థినే... అధ్యక్ష పీఠం వరిస్తుంది. తుది ఫలితాలు వెలువడేందుకు మరింత సమయం పట్టనుంది.
ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. జో బైడెన్ 220, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి.
మిగతా రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాల్లో రిపబ్లికన్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఇదే రీతిలో జరిగితే.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపే మరోసారి అధ్యక్షుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
13:43 November 04
హోరాహోరీ
అమెరికా అధ్యక్ష ఫలితాల్లో ట్రంప్, బైడెన్ హోరాహోరీ తలపడుతున్నారు. ఇప్పటివరకు బైడెన్‌కు 220, ట్రంప్‌నకు 213 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. 9 రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పెన్సిల్వేనియా(20), జార్జియా(16), మిషిగన్(16), నార్త్ కరోలైనా(15), విస్కాన్సిన్(10), అలాస్కా(3)లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.
ఆరిజోనా(11), నెవాడా(6), మెయిన్(4) రాష్ట్రాల్లో బైడెన్ ముందంజలో ఉన్నారు.
13:31 November 04
ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలు: పెన్సిల్వేనియా(20), జార్జియా(16), మిషిగన్(16), నార్త్ కరోలైనా(15), విస్కాన్సిన్(10), అలాస్కా(3).
13:13 November 04
- ఎన్నికల ఫలితాలను డెమొక్రాట్లు తారుమారు చేయాలని చూస్తున్నారు: ట్రంప్
- డెమొక్రాట్ల కుట్రను భగ్నం చేస్తాం: ట్రంప్
- పోలింగ్ ముగిశాక ఓట్లు వేయడం కుదరదు: ట్రంప్
- అతిపెద్ద విజయం సాధించబోతున్నాం: ట్రంప్
- ఓటింగ్ ఇంకా కొనసాగడంపై మాకు అభ్యతరం ఉంది: ట్రంప్
- పోలింగ్ ఆపాలని సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం: డొనాల్డ్ ట్రంప్
- ఎన్నికల్లో మేం ఇప్పటికే గెలిచేశాం: డొనాల్డ్ ట్రంప్
12:59 November 04
- భారీ విజయోత్సవానికి సిద్ధమవుదాం: డొనాల్డ్ ట్రంప్
- మా గెలుపు లాంఛనమే: రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్
- ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగుతోంది: ట్రంప్
- గెలుపు సంబరాలకు రిపబ్లికన్ పార్టీ సిద్ధంగా ఉంది: ట్రంప్
- జార్జియా, నార్త్ కరోలైనా రాష్ట్రాల్లో గెలువనున్నాం: ట్రంప్
- ప్రజలు భారీగా తరలివచ్చి మా పార్టీకి మద్దతు తెలిపారు: ట్రంప్
- పెన్సిల్వేనియాలో మేం భారీ ఆధిక్యంలో ఉన్నాం: ట్రంప్
- భారీ మద్దతు ఇచ్చినందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు: ట్రంప్
12:54 November 04
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. భారీ విజయోత్సవానికి సిద్ధమవుదామని పేర్కొన్నారు. డెమొక్రాట్లు ఫలితాలను తారుమారు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము అలా జరగనివ్వబోమని శ్వేతసౌధంలో మీడియా సమావేశంలో చెప్పారు.
12:34 November 04
ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలు
కెంటకీ, ఇండియానా, ఓక్లహోమా, టెక్సాస్, వెస్ట్‌వర్జీనియా, సౌత్‌కరోలైనా, టెన్నెసీ, సౌత్‌డకోటా, నార్త్‌డకోటా, కేన్సస్, ఫ్లోరిడా, మిస్సోరి, యూటా, ఒహాయో, ఐయోవా, అలబామా, లూసియానా, ఆర్కాన్సా, ఐడహో, మిస్సిసిప్పీ, నెబ్రాస్కా, వయోమింగ్, మాంటానా.
బైడెన్ గెలిచిన రాష్ట్రాలు
కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినొయ్, రోడ్‌ఐలండ్, వాషింగ్టన్, మాసాచుసెట్స్, మేరీల్యాండ్, కొలరాడో, కనెక్టికట్, ఓరెగన్, న్యూమెక్సికో, న్యూహాంప్‌షైర్, డెలావేర్, డీసీ, వెర్మాంట్, మిన్నసోటా.
12:16 November 04
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో జో బైడెన్ 220 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ట్రంప్ 213 ఓట్లు గెలుపొందారు.
12:00 November 04
టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో విజయంతో బైడెన్‌పై ఆధిక్యం సాధించారు ట్రంప్. బైడెన్‌కు 210 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ 213 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
11:48 November 04
కీలకమైన టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో విజయదుందుబి మోగించారు డొనాల్డ్ ట్రంప్. జార్జియా, పెన్సిల్వేనియాలో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
11:37 November 04
ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కీలక రాష్ట్రమైన ఫ్లోరిడాతో పాటు అయోవా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్ గెలిచారు.
11:35 November 04
- కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు
- అమెరికా అధ్యక్ష ఫలితాల్లో ట్రంప్, బైడెన్ హోరాహోరీ
- ఇప్పటివరకు బైడెన్‌కు 205, ట్రంప్‌నకు 171 ఎలక్టోరల్ ఓట్లు
11:24 November 04
ఎన్నికల్లో పెద్ద విజయం సాధించబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఫలితాలను డెమొక్రాట్లు తారుమారు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అతిపెద్ద విజయంపై కాసేపట్లో ప్రకటన చేస్తానని చెప్పారు.
11:16 November 04
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు జో బైడెన్. ట్రంప్‌తో హారాహోరీ పోటీ నెలకొన్న తరుణంలో ఆయన మీడియా ముందుకొచ్చారు. ఎన్నికల్లో డెమొక్రాట్లు చాలా కష్టపడ్డారని చెప్పారు. అమెరికా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
11:12 November 04
అమెరికా ఎన్నికల్లో భారత్ సంతతికి చెందిన ప్రమీల జయపాల్ విజయం సాధించారు. డెమొక్రాట్ల తరఫున వరుసగా మూడోసారి ప్రతినిధుల సభకు ఆమె ఎన్నికయ్యారు.
10:59 November 04
అమెరికా ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు బైడెనే ఆధిక్యంలో ఉన్నారు. కీలకమైన టెక్సాస్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, జార్జియా రాష్ట్రాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఫలితాలను నిర్ణయించే ఈ రాష్ట్రల్లో ట్రంప్-బైడెన్ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే వీటిలో ట్రంపే ఆధిక్యంలో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. 50 రాష్ట్రాల్లో మొత్తం 238 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అధ్యక్ష పీఠం దక్కాలంటే 270 ఓట్లు అవసరం.
10:47 November 04
ఇప్పటివరకు వెల్లడైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో 205 ఎలక్టోరల్ ఓట్లతో జో బైడెన్ ముందంజలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ 136 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు.
10:36 November 04
డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించాలని ఆమె పూర్వీకుల గ్రామం తులసేంద్రపురం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆమె స్ఫూర్తిదాయకమని, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశంలో ఆమె విజయం ఎంత కీలకమో యువత అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఉత్కంఠగా టీవీలో వీక్షిస్తున్నారు ఆ గ్రామస్థులు.
10:01 November 04
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని బీఎల్ఎం ప్లాజా వద్ద పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఫ్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేస్తూ నృత్యం చేశారు.
09:50 November 04
- ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో బైడెన్ విజయం
- కాలిఫోర్నియా(55), న్యూయార్క్(29)లో బైడెన్ విజయం
- వర్జీనియా(13), వాషింగ్టన్(12)లో బైడెన్ విజయం
09:44 November 04
వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లో జో బైడెన్ గెలిచారు.
09:35 November 04
ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలు
కెంటకీ, ఇండియానా, ఒక్లామా, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, టెన్నెసీ సౌత్ డకోటా, నార్త్ డకోటా, కేన్సస్, యుటా, నెబ్రస్కా, లూసియానా
బైడెన్ గెలుపొందిన రాష్ట్రాలు
వర్జీనియా, వెర్మాంట్, మేరీలాండ్ న్యూజెర్సీ, మాసాచుసెట్స్, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్ న్యూయార్క్, న్యూమెక్సికో, న్యూహాంప్‌షైర్
09:20 November 04
అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమొక్రాట్ నేత రాజా క్రిష్ణమూర్తి విజయం సాధించారు. వరుసగా మూడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
09:14 November 04
న్యూ మెక్సికో , న్యూహాంప్‌షైర్ రాష్ట్రాల్లో డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. యుటా, నెబ్రస్కా, లూసియానా రాష్ట్రాలో డొనాల్డ్ ట్రంప్ గెలిచారు.
09:02 November 04
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు జో బైడెన్ 94, డొనాల్డ్ ట్రంప్ 80 ఎలక్టోరల్ ఓట్లు గెలుపొందారు.
08:07 November 04
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ 72 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. జో బైడెన్ 89 ఓట్లను దక్కించుకున్నారు.
07:59 November 04
ఇప్పటి వరకు బైడెన్ 89, డొనాల్డ్ ట్రంప్ 63 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు
07:55 November 04
సౌత్ డకోటా, నార్త్ డకోటా రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. కొలరాడో, కెనెక్టికట్ రాష్ట్రాల్లో జో బైడెన్ విజయం సాధించారు.
07:50 November 04
బైడెన్ ఆధిక్యం
ఇప్పటి వరకు బైడెన్ 80, డొనాల్డ్ ట్రంప్ 51 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుంటే అధ్యక్ష పీఠం దక్కనుంది.
07:39 November 04
- కెంటకీ(8), ఇండియానా(11), ఒక్లామా(7), వెస్ట్ వర్జీనియా(5), సౌత్ కరోలినా(9), టెన్నెసీ(11) రాష్ట్రాల్లో ట్రంప్ విజయం
- వర్జీనియా(13), వెర్మాంట్(3), మేరీలాండ్(10), న్యూజెర్సీ(14), మాసాచుసెట్స్(11), డెలావేర్ (3) రాష్ట్రాల్లో జో బైడెన్ విజయం
07:30 November 04
ఇప్పటివరకు ట్రంప్‌కు 48, బైడెన్‌కు 44 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి.
07:22 November 04
- కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఇప్పటివరకు బైడెన్‌కు 44, ట్రంప్‌నకు 26 ఎలక్టోరల్ ఓట్లు
- అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు
- 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుంటే దక్కనున్న అధ్యక్ష పీఠం
07:09 November 04
టెన్నెసీ రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.
07:04 November 04
టెక్సాస్, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యం
06:51 November 04
వర్జీనియా, వెర్మాంట్, మేరీలాండ్, న్యూజెర్సీ, మాసాచుసెట్స్ రాష్ట్రాల్లో జో బైడెన్ విజయం
06:50 November 04
వెస్ట్ వర్జీనియా, కెంటకీ, ఒక్లామా, ఇండియానా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం
06:41 November 04
ఇండియానాతో పాటు ఓక్లామా, కెంటకీ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. వెర్మాంట్తో పాటు మేరీలాండ్, న్యూ జెర్సీ, మసాచుసెట్స్ రాష్ట్రాలను డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కైవసం చేసుకున్నారు.
06:24 November 04
డొనాల్డ్ ట్రంప్ వెస్ట్ వర్జీనియాలో గెలుపొందారు. ఇక్కడ ఐదు ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి. బైడెన్ వర్జీనియాలో విజయం సాధించారు. ఇక్కడ 13 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి.
06:13 November 04
డొనాల్డ్ ట్రంప్ ఇండియానాలో గెలుపొందారు. వర్జీనియా, దక్షిణ కరోలినాలో లీడ్‌లో ఉన్నారు. డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ టెక్సాస్, జార్జియా, ఫ్లొరిడా, న్యూ హాంప్‌షైర్‌లో ముందంజలో ఉన్నారు.
05:59 November 04
డొనాల్డ్ ట్రంప్ కెంటకీ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్నారు. వెర్మాంట్‌లో జో బైడెన్ విజయకేతనం ఎగురవేశారు.
05:53 November 04
పలు రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే ముగిసింది. చాలా చోట్ల కౌంటింగ్ మొదలైంది. అమెరికా తూర్పు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇతర ప్రాంతాల్లో దక్షిణాదిన ఓటింగ్ కొనసాగుతోంది. వందేళ్లల్లో ఎన్నడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.
05:13 November 04
మరికొన్ని గంటల్లో అమెరికాలో పోలింగ్ పూర్తి కానుంది. ఇప్పటికే ఇండియానా, కెంటకీ ప్రాంతాల్లో ఓటింగ్ పూర్తయింది.
04:30 November 04
డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేశారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ముగియనున్న తరుణంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
04:28 November 04
ఎన్నికల పోలింగ్‌లో ఇప్పటివరకు ఎలాంటి సైబర్ దాడి జరగలేదని సైబర్ భద్రతా ఏజెన్సీ హోంలాండ్ సెక్యూరిటీ తెలిపింది. చిన్న సాంకేతిక సమస్యలు మాత్రమే వచ్చినట్లు వెల్లడించింది. అయితే ఫలితాలు వెల్లడయ్యే సమయంలో మాత్రం సైట్ల మీద ఒత్తిడి ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
03:23 November 04
డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమాలా హారిస్.. మిచిగాన్ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో బైడెన్‌కు ఓటు వేయాల్సిందిగా కోరారు.
03:17 November 04
ఆలస్యంగా ఉత్తర కరోలినా ఫలితాలు...
ఉత్తర కరోలినా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ఓటింగ్ నిర్ణీత సమయం కన్నా 45 నిమిషాలు ఎక్కువగా జరగనుంది. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన కారణంగా ఈ అవకాశం ఇచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యం కానున్నాయి .
03:10 November 04
జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఆమె భర్త తరఫున ఫ్లోరిడాలో ప్రచారం నిర్వహించారు. అమెరికా ఎన్నికల్లో ఫ్లోరిడా రాష్ట్రం కీలకం. ఇక్కడ గెలుపు అటు ట్రంప్, ఇటు బైడెన్ ఇద్దరికీ అవసరం.
02:51 November 04
ఫిలడెల్ఫియాలో తన మద్దతుదారులను ఉద్దేశించి జో బైడెన్ ప్రసంగించారు. ఒకవేళ తాను అధ్యక్షుడిని అయితే ఇక రెడ్, బ్లూ స్టేట్స్ అంటూ భేదాలు ఉండవని కేవలం అమెరికా ఉంటుందని అన్నారు.
02:37 November 04
మిచిగాన్ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ డెమొక్రాట్లు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే ఈ రాష్ట్రాన్ని మరోసారి సొంతం చేసుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు.
02:36 November 04
కాలిఫోర్నియాలో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ చేయాలని డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ట్వీట్ చేశారు.
02:35 November 04
జో బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ ట్వీట్ చేశారు.
"బైడెన్ బృందం నెమ్మదిగా జారిపోతుంది. వారికి భయమేస్తుంది."
- ఎరిక్ ట్రంప్
02:35 November 04
డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి డో బైడెన్ ఫిలడెల్ఫియా చేరుకున్నారు. ప్రజలను ఓటు వేయాలని కోరుతున్నారు బైడెన్.
02:17 November 04
ట్రంప్ X బైడెన్: రికార్డ్ స్థాయి పోలింగ్ దిశగా అమెరికా!
అమెరికా ఎన్నికలు హైలైట్స్..
అగ్రరాజ్యంలో ఎన్నికల వేళ ఓట్ల అవకతవకలపై వస్తోన్న ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. విదేశీ శక్తుల చేతిలో అమెరికా ఓట్లు అవకతవకలు గురయ్యాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టంచేసింది.
- దేశవ్యాప్తంగా ఇప్పటికే ముందస్తు పోలింగ్‌లో దాదాపు 10కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అధ్యక్షుడు ఎవరనేది తేల్చేందుకు అమెరికన్లు భారీ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఐదు గంటల నుంచే ఓటర్లు క్యూలైన్లో నిలబడ్డారు.
- కరోనా వైరస్ విజృంభణ కారణంగా పోలింగ్ స్టేషన్ల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు.
- పోలింగ్ జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్‌లోనే ఉన్నారు. కాగా డెమొక్రాటిక్ అభ్యర్థి జోబైడెన్ పోలింగ్ రోజు ఉదయం ఆయన సతీమణి జిల్‌తో కలిసి చర్చిని సందర్శించారు. పోలింగ్ రోజు మొత్తం పెన్సిల్వేనియా, డెలవేర్‌లోనే ఉండే అవకాశం ఉంది.
- జో బైడెన్ ముందంజలో ఉన్నారని ప్రీ పోల్స్ అంచనా వేసినప్పటికీ, ఇద్దరి అభ్యర్థుల మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, విస్కాన్‌సిన్, మిషిగాన్, ఆరిజోనా వంటి కీలక రాష్ట్రాల్లో ఇద్దరిమధ్య హోరాహోరి పోరు ఉండనుందని అంచనా.
- ఈ ఎన్నికల్లో తనకు 306 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో ట్రంప్ 304 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇక కమలా హారిస్ గెలిస్తే అమెరికా ప్రజలతోపాటు మహిళలకు పరిస్థితులు భయంకరంగా ఉంటాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
- కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడి సతీమణి మిషెల్లీ ఒబామా మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఒటర్లు ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని ఆమె పిలుపునిచ్చారు.