సామాజిక మాధ్యమాల రారాజుగా పేరొందిన ఫేస్బుక్ సంస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాలిఫోర్నియా సెనేటర్, భారత సంతతి కమలా హారిస్. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్లతో ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్‌బుక్‌ను విభజించాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఫేస్బుక్... నియంత్రించలేని స్థితికి చేరిందని అభిప్రాయపడ్డారు. వినియోగదారుల సమాచారాన్ని ఫేస్బుక్ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
" ఈ విషయాన్ని మనం ఎంతో క్షుణ్ణంగా పరిశీలించాలి. సామాజిక మాధ్యమాలు మనకు ఎంతో ప్రయోజనకరం. ఫేస్బుక్ వినియోగించేవారి సంఖ్య ఎక్కువే. సమాజంతో భాగస్వాములుగా ఉంటూ, ఏ వృత్తిలోనైనా ఫేస్‌బుక్‌ను వినియోగించకుండా కార్యకలాపాలు సాగించే వారి సంఖ్య తక్కువ. ఏ స్థాయి వ్యాపారంలో అయినా ఫేస్‌బుక్‌ను వినియోగించకుండా ఉండటం చాలా కష్టం. ఇది నియంత్రించలేని ప్రయోజనంగా మారింది. నాకు సంబంధించినంత వరకు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి."
- కమలా హారిస్, కాలిఫోర్నియా సెనేటర్
అమెరికా దిగ్గజ సంస్థల కార్యాలయాలు కొలువుదీరిన కాలిఫోర్నియా నుంచే సెనేటర్‌గా గెలుపొందారు కమలా హారిస్. డెమొక్రటిక్ పార్టీ తరఫున 2020 అధ్యక్ష రేసులో ఉన్నారు.