అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబంలోకి కొత్త శునకం చేరింది. మూడు నెలల జర్మన్ షెపర్డ్ జాతి కుక్క పిల్లను బైడెన్ పెంచుకుంటున్నారు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు బైడెన్.
ఈ జర్మన్ షెపర్డ్‌కు 'కమాండర్' అని పేరు పెట్టారు. కమాండర్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌కు జత చేశారు బైడెన్. 'శ్వేత సౌధానికి స్వాగతం కమాండర్' అని రాసుకొచ్చారు.
కమాండర్‌ను అధ్యక్షుడి సోదరుడు జేమ్స్ బైడెన్ కానుకగా ఇచ్చారు. సోమవారమే శ్వేతసౌధంలో అడుగుపెట్టింది కమాండర్.
కమాండర్‌కు ముందు రెండు శునకాలు బైడెన్ కుటుంబంలో ఉండేవి. 'ఛాంప్'.. ఈ ఏడాది జూన్‌లో మరణించింది. మరో శుకనం 'మేజర్' ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల దానిని శిక్షణా కేంద్రానికి పంపించారు. మేజర్ తిరిగి రాకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
పిల్లి కూడా!
బైడెన్.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన కొన్ని రోజులకు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఓ ప్రకటన చేశారు. తమ కుటుంబంలోకి ఓ పిల్లి చేరుతోందన్నారు. ఆ తర్వాత ఇప్పటికీ వారు పిల్లులను పెంచుకోలేదు. తాజాగా దీనిపై ఓ ప్రకటన వెలువడింది. వచ్చే జనవరిలో పిల్లి కూడా బైడెన్ కుటుంబంలో చేరుతుందని జిల్ బైడెన్ ప్రతినిధి లారోసా తెలిపారు.
ఇవీ చూడండి:-Dog Baby Shower: శునకానికి సీమంతం.. ఇరుగుపొరుగు దీవెనలు!