ఇస్లామిక్ వేర్పాటువాదులు జమ్ముకశ్మీర్లో నిత్యం కొనసాగుతున్న ప్రమాదమని అమెరికా చట్టసభ సభ్యుడు ఫ్రాన్సిస్ రూనీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
ఫ్లోరిడా రాష్ట్రం నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూనీ.. చట్టసభలో భారత్తో సంబంధాలపై ప్రసంగించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దూకుడుగా ముందుకెళ్తున్న చైనాను భారత్ ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలో భారత్కు అమెరికా సహకారం అవసరమని వ్యాఖ్యానించారు. వాణిజ్య రంగంలో శ్వేతసౌధానికి భారత్ కీలక భాగస్వామిగా అభివర్ణించారు.
"ప్రాంతీయ, భౌగోళిక రాజకీయాలను భారత్ ఎదుర్కొంటోంది. ఇస్లామిక్ వేర్పాటువాదం కశ్మీర్లో నిత్యం కొనసాగుతున్న ప్రమాదం. జమ్ముకశ్మీర్ సహా భారత్ అంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్కు సహకరించాలి."