కెనడాలో ప్రధాన ప్రతిపక్షమైన కన్సర్వేటివ్ పార్టీకి పాలక లిబరల్ పార్టీకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా 121 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 338 సీట్లు గల కెనడా పార్లమెంటులో సాధారణ మెజారిటీ లభించాలంటే 170కి మించి సీట్లు రావాలి. పాలక లిబరల్ పార్టీకి దక్కినవి 157 సీట్లు మాత్రమే. అదే అతి పెద్ద పార్టీగా నిలిచినా కనీస మెజారిటీ లేకపోవడంతో సొంతగా అధికారం చేపట్టజాలదు. ఈ పరిస్థితుల్లో భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు జగ్మీత్ సింగ్ ‘కింగ్‌మేకర్’గా ఆవిర్భవించారు. సింగ్ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ)కి 24 సీట్లు రావడంతో, ట్రూడో మైనారిటీ ప్రభుత్వానికి ఆయన అవసరం ఎంతో ఉంది.
సాధారణంగా ఒక భారత సంతతి వ్యక్తి విదేశాల్లో రాజకీయంగా ఇంత పట్టు సాధించినందుకు భారత ప్రభుత్వం సంతసించాలి. కానీ, ఖలిస్థాన్ సానుభూతిపరుడైన జగ్మీత్ సింగ్ భారత ప్రభుత్వంపై తరచూ విమర్శలు రువ్వుతుంటారు. కెనడా ఎన్నికల్లో మూడో అతి పెద్ద పార్టీగా అవతరించిన బ్లాక్ క్వెబెక్వా, ఎన్డీపీలు ట్రూడో ప్రభుత్వానికి అంశాలవారీగా మద్దతు ఇస్తాయి. ఖలిస్థాన్ అనుకూల ఎన్డీపీ ఇంతటి కీలక పాత్రధారిగా అవతరించడం భారత్-కెనడా సంబంధాలకు శుభసూచకం కాదు. నిజానికి బహుళజాతులకు, సంస్కృతులకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు నిలయాలైన భారత్, కెనడాలు సహజ మిత్రులుగా విలసిల్లవలసింది. ఆంగ్ల భాష, న్యాయపాలన వంటి ఉమ్మడి లక్షణాలున్న ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం వర్థిల్లవలసింది. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు.
కెనడాను 42 ఏళ్ల తరవాత సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కావడం విస్మయకర వాస్తవం. పోఖ్రాన్ అణు పరీక్షల తరవాత భారత్‌తో అణు సహకారానికి స్వస్తి చెప్పిన కెనడా 2010లో పౌర అణుశక్తి కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించింది. దీనివల్ల 2015 ఏప్రిల్‌లో భారత ప్రధాని కెనడా సందర్శనకు వీలు ఏర్పడింది. ఆ యాత్ర ఘనంగా విజయవంతమైంది. అప్పట్లో కెనడా ప్రధానిగా ఉన్న కన్సర్వేటివ్ నాయకుడు స్టీఫెన్ హార్పర్ భారతదేశ సమైక్యత, సమగ్రతలకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. దాంతో రెండు దేశాల సంబంధాల్లో నిస్సందేహంగా కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2015 కెనడా ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. భారత ప్రధాని మోదీ ఆయన్ను అభినందించి భారత సందర్శనకు రావలసిందిగా ఆహ్వానించారు. కానీ, తన పార్టీలో, ప్రభుత్వంలో ఖలిస్థానీ శక్తుల మాటలకు చెవి ఒగ్గిన ట్రూడో భారత యాత్రలో మోదీ సర్కారుకు అంత దగ్గర కాలేకపోయారు.కెనడాలోని సిక్కులు ఆయన్ను జస్టిన్ సింగ్ అని పిలుస్తారని గమనిస్తే, ఉభయుల మధ్య సంబంధాలు ఎంత గాఢమైనవో అర్థమవుతుంది.