అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న సందర్భంగా వేడుకలు చేసుకునేందుకు సర్వం సిద్ధం చేశారు భారతీయ-అమెరికన్లు. కోట్లాది మంది హిందువుల స్వప్నం సాకారమయ్యే కార్యక్రమాన్ని పురస్కరించుకుని అమెరికావ్యాప్తంగా ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాలు కొత్త కళను సంతరించుకోనున్నాయి.
హిందూ మందిర్ నిర్వాహక సంఘం, హిందూ మందిర్ పూజారుల సంఘం అమెరికాలోని వేరు వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలకు పిలుపునిచ్చింది. న్యూయార్క్ లో హిందూ మత నాయకులు ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో భారీ ఎత్తున దీపారాధన చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రముఖ సాధువులు, ఇతర ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో రామాలయానికి శంకుస్థాపన చేసే సమయంలో.. శ్రీరాముడు, అయోధ్య మందిరాల త్రీడీ చిత్రాలు అమెరికా నగరాల్లో కనువిందు చేయనున్నాయి. ఇందుకోసం డిజిటల్ హోర్డింగులు లీజుకు తీసుకున్నారు. మంగళవారం రాత్రి శ్రీరామ మందిరాన్ని కళ్లకు కట్టే విధంగా ఓ శకటాన్ని కాపిటల్ హిల్, శ్వేతసౌధం మీదగా ఊరేగించనున్నారు.
ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచే విధంగా.. న్యూయార్క్లో దాదాపు 17000 చదరపు అడుగుల చతరుస్ర ఎల్ ఈడీ స్క్రీన్ పై శ్రీరామ మందిర చిత్రాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.. అమెరికా భారత ప్రజా వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు జగదీశ్.
ఇదీ చదవండి: రేపే ముహూర్తం- భూమిపూజకు శరవేగంగా ఏర్పాట్లు