India Pakistan UNSC: ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లో రాచమర్యాదలు దక్కడంపై భారత్ మండిపడింది. ఉగ్రవాదం వల్ల సాధారణ పౌరులకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితిలో పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడి వ్యూహకర్తలకు పాకిస్థాన్‌లో అన్ని రకాలుగా తోడ్పాటు అందుతోందని తెలిపింది. 'సాయుధ ఘర్షణల నుంచి పౌరులను రక్షించాల'నే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రసంగించిన భారత శాశ్వత ప్రతినిధి ఆర్ మధుసూదన్.. ఉగ్రవాదులకు సహకరించడంలో పాకిస్థాన్‌కు దశాబ్దాల చరిత్ర ఉందని ఎండగట్టారు. ఇదే వేదికపై భారత్ లక్ష్యంగా విషప్రచారం చేసిన పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు.
India against pakistan UN
"ఐరాస వేదికను దుర్వినియోగం చేయడం పాకిస్థాన్‌కు ఇది మొదటిసారేం కాదు. ఉగ్రవాదులకు ఎక్కడా లేని స్వేచ్ఛ లభిస్తున్న పాకిస్థాన్ స్థితిగతుల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి మద్దతు అందించడంలో పాకిస్థాన్‌కు దశాబ్దాల చరిత్ర ఉందని ఐరాస సభ్యదేశాలకు తెలుసు. ఉగ్రవాదుల స్పాన్సర్‌గా ప్రపంచ దేశాల గుర్తింపు పొందింది. ఐరాస భద్రతా మండలి గుర్తింపు పొందిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోనే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయంలో పాకిస్థాన్‌ది ప్రపంచ రికార్డు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడుల్లో ఏదో ఓ రూపంలో పాకిస్థాన్ హస్తం ఉంటోంది. ఒసామా బిన్‌లాడెన్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మాట్లాడతారు. ఎలాంటి అధైర్యానికి లోనుకాకుండా అదే దారిలో వీరు పయనిస్తున్నారు. పౌరులకు రక్షణ కల్పించే విషయంపై మనం చర్చిస్తున్నాం. ప్రజలకు అతిపెద్ద ముప్పు ఉగ్రవాదుల నుంచే ఉంటోంది."
-ఆర్ మధుసూదన్, ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి