ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ నివేదికపై ప్రధానంగా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిపింది భారత్. అయితే.. ముందుగా సముద్ర తీర ప్రాంత భద్రతపై చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టిన క్రమంలో.. ఈ వాఖ్యలు చేశారు భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి.
" ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల తీరును లేవనెత్తటంలో ఎన్నడూ విఫలం కాలేదు. ముఖ్యంగా ఆఫ్రికాలో పెట్రేగిపోతున్న తీవ్రవాద అంశమే ఉదాహరణ. ఐఎస్ఐఎల్, ఐఎస్ఐఎస్ ఉగ్రముఠాలపై ఐరాస సెక్రటరీ జనరల్ నివేదికపై చర్చిస్తాం. ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారిస్తాం. సముద్ర తీర ప్రాంత భద్రతపై తొలిత చర్చించే అవకాశం ఉంది. మా విదేశీ విధానంలో సముద్ర తీర భద్రత అనేది తొలి ప్రాధాన్యమని మీకు తెలుసు. ఈ అశంపై భద్రతా మండలి సంపూర్ణ విధానం అవలంభించాల్సిన సరైన సమయం ఇదేనని నమ్ముతున్నాం. "
- టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి.