ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. ఆగస్టు నెల మొత్తం భారత్ ఈ పదవిలో కొనసాగనుంది. అంతకుముందు నెల(జులై)లో ఈ పదవిలో ఉన్న ఫ్రాన్స్ ప్రతినిధి నుంచి భారత రాయబారి బాధ్యతలు స్వీకరించారు. భద్రతా మండలిలో రెండేళ్ల పాటు (2021-2022) తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతోన్న భారత్, అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఆగస్టు నెలతో పాటు తాత్కాలిక సభ్య దేశంగా గడువు ముగిసే (డిసెంబర్ 2022) చివరి నెలలోనూ మరోసారి అధ్యక్ష పదవిని భారత్ చేపట్టనుంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.
ఆ మూడు అంశాలు..
ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పీఠాన్ని చేపట్టిన భారత్, కీలక అంశాలపై దృష్టిపెట్టనుంది. ముఖ్యంగా శాంతి స్థాపన, ఉగ్రవాదంపై పోరు, సముద్ర తీర భద్రత అంశాలను అజెండాగా పేర్కొంది. ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తిస్తామని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎప్పుడూ ముందుంటుందని.. ఇకపై కూడా ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. భారత్ ఈ పదవి చేపట్టడానికి కృషిచేసిన ఫ్రాన్స్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.