దక్షిణ అమెరికా క్షీరదాలు లామాల రోగ నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీల నిర్మాణంతో ఆతిథ్య కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశాన్ని నిరోధించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఈ పద్ధతి కొవిడ్- 19 చికిత్సకు సమర్థంగా పనిచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
అమెరికా టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన అధ్యయనం 'జర్నల్ సెల్'లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో లామా రోగనిరోధక వ్యవస్థలో రెండు ప్రత్యేక యాంటీబాడీలను నమూనాలను అనుసంధానించారు.
ప్రోటీన్ నిర్మాణం లక్ష్యంగా..
కరోనా వైరస్పైన ఉండే ప్రోటీన్ నిర్మాణం 'స్పైక్'ను గట్టిగా పట్టి ఉంచే సరికొత్త వ్యవస్థను ఇది నిర్మిస్తుందని గుర్తించారు. ఈ నిర్మాణం సాయంతోనే శరీర కణాల్లోకి వైరస్ ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ సరికొత్త యాంటీబాడీలు వైరస్ను కణాల్లోకి చేరకుండా నియంత్రిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
"సార్స్-కోవ్-2 వైరస్ను తటస్థీకరించే మొదటి యాంటీబాడీలు ఇవే. ప్రస్తుతం జంతువులపై క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాం. యాంటీబాడీ చికిత్సతో నేరుగా రోగనిరోధక శక్తి లభిస్తుంది. చికిత్స తర్వాత వారికి రక్షణ ఉంటుంది. ఇప్పటికే అనారోగ్యం పాలైన వారిని కూడా ఈ విధానంలో చికిత్స చేయవచ్చు. "
-మెక్లెల్లన్, పరిశోధకుడు
వ్యాక్సిన్లకు స్పందించని వృద్ధుల్లో చికిత్సకు ఈ విధానాన్ని విజయవంతంగా ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.