తెలంగాణ

telangana

ETV Bharat / international

'క్లోరోక్విన్​ ఓ రక్షణ రేఖ- శక్తిమంతమైన ఔషధం' - trump says hcq is a medicine

కరోనా వైరస్‌ సోకకుండా తాను ప్రతిరోజు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ‌(హెచ్‌సీక్యూ) ఔషధాన్ని తీసుకోవడాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గట్టిగా సమర్థించారు. ఈ మందు 'రక్షణ రేఖ'గా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. మరికొంత కాలం తాను ఈ ఔషధాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ఎలాంటి అభద్రత అవసరం లేదని తాను భావిస్తు న్నట్టు చెప్పారు.

Hydroxychloroquine a line of defence against virus says Trump
'ఆ మాత్రలేసుకుంటే.. కరోనా నన్ను చేరలేదు'

By

Published : May 20, 2020, 10:49 AM IST

క్లోరోక్విన్‌ వాడకాన్ని మరోసారి సమర్థించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. తాను ప్రచారం కల్పించడం వల్లే హెచ్‌సీక్యూకి చెడ్డపేరు వచ్చిందన్నారు. ఇంకెవరైనా ఈ మందు గురించి చెప్పి ఉంటే అద్భతమైన ఔషధంగా అభివర్ణించేవారని అభిప్రాయపడ్డారు. ఇది చాలా శక్తిమంతమైన ఔషధమని.. దీని వల్ల ఎలాంటి హాని ఉండదని పునరుద్ఘాటించారు. అందువల్లే కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న అనేక మంది సిబ్బందికి దీన్ని ప్రతిపాదించానని గుర్తుచేశారు.

ప్రపంచవ్యాప్తంగా వైద్యులు హెచ్‌సీక్యూ వాడకంపై సానుకూలత వ్యక్తం చేసినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో ఈ ఔషధం మెరుగైన ఫలితాలు ఇచ్చాయని చూపిన అధ్యయనాలు ఉన్నట్లు గుర్తుచేశారు. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం తప్పుడు ఫలితాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కావాలనే చనిపోయే స్థితిలో ఉన్నవారికి ఈ ఔషధాన్ని ఇచ్చి ప్రతికూల ఫలితాలు వెల్లడించారన్నారు.

మరోవైపు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మాత్రం తాను హెచ్‌సీక్యూ తీసుకోవడం లేదని తెలిపారు. తనకు వైద్యులు ఎలాంటి ఔషధాలు సిఫార్సు చేయలేదని పేర్కొన్నారు. అయితే, వైద్యుల సూచన మేరకు అమెరికా ప్రజలెవరైనా హెచ్‌సీక్యూ తీసుకోవడాన్ని మాత్రం తాను వ్యతిరేకంచలేనన్నారు. మరోవైపు తాను ప్రతిరోజు హెచ్‌సీక్యూ తీసుకుంటున్నానని ట్రంప్‌ ప్రకటించడంపై అక్కడి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కొవిడ్‌-19ను నయం చేయగలిగే సామర్థ్యం హెచ్‌సీక్యూకి ఉందో లేదో వైద్యపరంగా నిర్ధరణ కాకుండా అధ్యక్షుడు దీని వాడకాన్ని ప్రోత్సహించడం హానికరమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:మహమ్మారిని ఓడించి ప్రాణం నిలుపుతోంది!

ABOUT THE AUTHOR

...view details