అమెరికా జంతుప్రదర్శనశాలలో రెండు చింపాంజీలు అచ్చం మానవుల్లాగే నృత్యం చేయడాన్ని గమనించారు శాస్త్రజ్ఞులు. వీటిలో ఇప్పటిదాకా ఎన్నడూ చూడని ఈ ప్రవర్తన చూసి మానవుల్లో నృత్య నైపుణ్యం ఎలా ఉద్భవించిందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది.
యూకే వార్విక్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు రెండు ఆడ చింపాంజీలు నృత్యం చేయడాన్ని పరిశీలించారు. రెండూ సమన్వయంతో సంగీతానికి అనుగుణంగా కాళ్లు కదుపుతూ స్టెప్పులేయడాన్ని గమనించారు. ఆర్కెస్ట్రా ప్లేయర్ల సంగీతానికి సరిపోలేలా చింపాజీలు నృత్యం చేశాయి. అయితే ఇప్పటి వరకు మనుషులు తప్ప మరే ఇతర జీవులు సమన్వయంతో సంగీతానికి తగ్గట్టుగా నృత్యం చేసిన సందర్భాలు లేవు. తొలిసారి ఈ లక్షణాన్ని రెండు ఆడ చింపాంజీల్లో గమనించారు పరిశోధకులు. ఇది వాటికున్న గొప్ప లక్షణమని పేర్కొన్నారు. బహుశా మానవుల్లో నృత్య నైపుణ్యం వీటి నుంచే ఉద్భవించి ఉంటుందని భావిస్తున్నారు.
"నృత్యం...మానవ వ్యక్తీకరణకు చిహ్నం. ప్రపంచంలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు జంతువుల వ్యవస్థల అద్భుతమైన సమృద్ధిని గుర్తు చేస్తున్నా... మనుషుల్లో నృత్య నైపుణ్యం ఎలా వచ్చిందనే విషయం మాత్రం అస్పష్టంగా ఉంది."