ఉదయం ఆహారం అధికంగా తీసుకోవడం, రాత్రి మితంగా తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయం ఓ సర్వేలో వెల్లడైంది. ఈ ఆహార నియమాలను పాటించడం ద్వారా శరీరంలోని చక్కెర స్థాయితోపాటు బరువు అదుపులో ఉంటుందని అధ్యయనం వెల్లడించింది.
అమెరికా వాషింగ్టన్కు చెందిన పరిశోధకులు ఈ సర్వే చేశారు. 'జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ఆఫ్ ది ఎండోక్రైన్ సొసైటీ'లో ఈ అధ్యయనంపై కథనం ప్రచురితమైంది.
డీఐటీ ఆధారంగా
తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం సహా శరీర భాగాలకు పోషణ అందించడానికి శక్తి అవసరం అవుతుంది. ఈ ప్రక్రియను ఆహార-ప్రేరిత థర్మోజెనిసిస్గా(డీఐటీ) పిలుస్తారు. ఇది శరీరంలో జీవక్రియ విధానాన్ని సూచిస్తుంది. దీని ఆధారంగా ఈ సర్వే చేసినట్లు పరిశోధకులు చెప్పారు.
"రాత్రి కంటే ఉదయం డీఐటీ ఎక్కువగా ఉంటుందని మా అధ్యయనంలో తేలింది. ఉదయం అధిక ఆహారం తీసుకోవడం అన్ని వయస్కుల వారికి ఎంతో అవసరం. అధిక బరువుతో బాధపడే వారే కాక ఆరోగ్యవంతులు కూడా ఉదయం అధికంగా, రాత్రి తక్కువగా తినడం వల్ల జీవక్రియ మెరుగుపడి బరువును అదుపులో ఉంచుకోవచ్చు."
-జులియాన్ రిక్టర్, పరిశోధకుడు
ఈ పరిశోధనలో భాగంగా 16 మందిపై మూడు రోజుల పాటు పలు పరీక్షలు నిర్వహించారు. తొలుత ఉదయం తక్కువ కేలరీలు ఉన్న ఆహారం, అధిక కేలరీలు ఉన్న డిన్నర్ అందించారు. తర్వాత అధిక కేలరీలు ఉన్న ఆహారం, తక్కువ కేలరీలు ఉన్న రాత్రి భోజనం అందించారు.
ఉదయం అధిక కేలరీలు తీసుకోవడం ద్వారా 2.5 రెట్లు డీఐటీ నమోదైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ విధమైన ఆహారం వల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిల్లో మార్పులు జరిగినట్లు తెలిపారు. తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ ఆకలి కలుగుతుందని, స్వీట్లు తినాలనే కోరిక ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం