జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్పీ) సభ్య దేశాల నుంచి భారత్‌ను తొలగిస్తే అమెరికా నష్టపోక తప్పదని ఆ దేశ వాణిజ్య సంస్థలు రూపొందించిన నివేదికలో తేలింది. హోదా రద్దు చేస్తే ఏడాది కాలంగా వాణిజ్య యుద్ధంలో ఉన్న చైనాకే లబ్ధి చేకూరుతుందని తాజా నివేదిక స్పష్టం చేసింది. చైనాతో వాణిజ్య యుద్ధం కారణంగా ఇకపై అమెరికా సంస్థలు జీఎస్పీ దేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జీఎస్పీ అంటే...
జీఎస్పీ హోదా కల్గిన దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండానే వస్తువులను ఎగుమతి చేసుకోవచ్చు. బదులుగా అమెరికా వ్యాపార సంస్థలకు వాణిజ్య అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
జీఎస్పీ కారణంగా మార్చిలో అమెరికా సంస్థలకు 105 మిలియన్ డాలర్లు ఆదా అయినట్లు ఆ దేశ వాణిజ్య సంస్థలు నివేదికలో తెలిపాయి. గతేడాది మార్చి నెలతో పోల్చితే ఇది 36శాతం అధికం. 2019 మొదటి త్రైమాసికంలో ఈ విధానం ద్వారా అమెరికా కంపెనీలు 285 మిలియన్ డాలర్లు కూడబెట్టుకున్నాయి.
భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 4న ప్రకటించారు. 60 రోజుల నోటీసు వ్యవధి మే 3తో ముగిసింది.