ప్రపంచీకరణ వల్ల ఒక తరంలోనే భారత జీడీపీ మూడింతలు పెరిగిందని, కానీ దీనిలో కార్మికులకు వాటా దక్కలేదని నోబెల్ బహుమతి గ్రహీత, హార్వార్డ్ యూనివర్సిటీ గణితం, ఆర్థిక శాస్త్రాల ప్రొఫెసర్ ఎరిక్ మస్కిన్ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో కొవిడ్-19 కంటే, ప్రజల మధ్య పెరుగుతున్న ఆర్థిక అంతరాలే అతిపెద్ద సమస్యగా ఆయన అభివర్ణించారు. అశోకా యూనివర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి ఆన్లైన్లో ఆయన మాట్లాడారు.
ప్రపంచీకరణతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంపద పెరిగినట్లు, దాంతో పాటే అసమానతలు పెరిగినట్లు మస్కిన్ వివరించారు. ఈ అసమానతలను మార్కెట్ శక్తులు పరిష్కరించలేవని స్పష్టం చేశారు. గత పాతికేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమైందని, కానీ అదే సమయంలో ధనికులు- పేదల మధ్య అంతరం ఎంతగానో పెరిగిపోయిందని వెల్లడించారు.
అయినా ఆహ్వానించాల్సిందే..
ఆర్థిక అసమానతలకు, సామాజిక- రాజకీయ అస్థిరతకు సంబంధం ఉందని, బ్రెజిల్ వంటి దేశాల్లో ఆర్థిక అసమానతలు పెరిగిపోయిన ఫలితంగా రాజకీయ సమీకరణలు సమూలంగా మారిపోయిన వైనాన్ని మస్కిన్ ఉదహరించారు. ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోకుండా ఉండాలంటే, అసమానతలను నిర్మూలించటానికి గట్టి కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు. అదే సమయంలో ఎన్నో ప్రయోజనాలు కల్పించటం సహా సంపద వృద్ధికి విశేషంగా దోహదపడిన 'ప్రపంచీకరణ'ను ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఎవరీ మస్కిన్?
ఎరిక్ మస్కిన్ 2017లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. 'మెకానిజమ్ డిజైన్ థియరీ' అనే అంశంపై చేసిన కృషికి ఆయనతో పాటు ఎల్. హుర్విక్, ఆర్. మేర్సన్ లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి ఇచ్చారు. ఎరిక్ మస్కిన్ గేమ్ థియరీ, కాంట్రాక్ట్ థియరీ, సోషల్ ఛాయిస్ థియరీ, పొలికల్ ఎకానమీ.. తదితర ఎన్నో సంక్లిష్టమైన అంశాలపై పరిశోధనలు చేశారు.
ఇదీ చూడండి:చదువుల ఖర్చులు తట్టుకునేలా.. సిద్ధంగా ఉండాల్సిందే!