ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 13 లక్షల 62 వేలు దాటగా.... 76 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు వ్యాధి సోకిన వారిలో 2 లక్షల 93 వేల మందికిపైగా కోలుకున్నారు. స్పెయిన్‌లో ఈ ఒక్కరోజే 457 మంది చనిపోగా.. బెల్జియంలో 403 మంది మరణించారు.
మృత్యుఘంటికలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. వైరస్ ధాటికి ఐరోపా దేశాలు కుదేలవుతున్నాయి.
స్పెయిన్: ఈ ఒక్కరోజే 3,800కుపైగా కేసులు నమోదయ్యాయి. 457 మంది మరణించారు. స్పెయిన్‌లో రోజువారీ కరోనా మరణాల రేటు వరుసగా నాలుగు రోజులు పడిపోయిన తరువాత.. మంగళవారంనాడు 743కు పెరగడం గమనార్హం. మొత్తంగా ఆ దేశంలో కరోనా మరణాలు 13,798కి చేరుకున్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
బెల్జియం:ఇవాళ ఒక్కరోజే అక్కడ 403 మంది మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 2,035కు చేరింది. బెల్జియంలో కొత్తగా 1,380 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 23 వేలు దాటింది.