అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ను వెంటాడుతోంది. ఇప్పటికే ట్రంప్ వ్యక్తిగత ఖాతాను శాశ్వతంగా నిషేధించిన ట్విట్టర్.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న 70 వేల ఖాతాలను నిలిపేసింది. ట్రంప్ అనుకూల కుట్రతో వీరికి సంబంధం ఉన్నట్లు గుర్తించిన ట్విట్టర్... వీరి ఖాతాలను నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఫేస్‌బుక్ సైతం ట్రంప్ అనుకూల పోస్టులపై చర్యలకు దిగింది. ఎన్నికల్లో మోసాలను ప్రస్తావిస్తూ ట్రంప్ మద్దతుదారులు ఉపయోగిస్తోన్న దొంగతాన్ని ఆపండి(స్టాప్ ది స్టీల్) అనే పదం ఉన్న అన్ని పోస్టులను తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ పదాన్ని ఉపయోగించి ట్రంప్ మద్దతుదారులు తరచుగా నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారని తెలిపింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నవంబర్ 3 నుంచి 'స్టాప్ ది స్టీల్' అనే పదం ఉన్న పోస్టులను గణనీయమైన సంఖ్యలో తొలగించామని వివరించింది. తమ నిబంధనలను ఉల్లంఘించే ఎలాంటి పోస్టునైనా తొలగిస్తామన్న ఫేస్‌బుక్.. హింసను ప్రేరేపించే తప్పుడు సమాచారాన్ని ఆపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.