అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళుతోంది స్పేస్ఎక్స్. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐసీఎస్)లోని వ్యోమగాములకు క్రిస్మస్ బహుమతులతో పాటు, పరిశోధన పరికరాలతో కూడిన సరికొత్త, అతిపెద్ద డబుల్ డ్రాగన్ నౌకను నింగిలోకి పంపింది. దీని ద్వారా తొలిసారి రెండు క్యాప్సుల్స్‌ను ఒకేసమయంలో పంపించిన ఘనత సాధించింది.
నాసాకు చెందిన కెన్నెడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ పాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ కొత్త డ్రాగన్ నౌకను అంతరిక్షంలోకి పంపారు శాస్త్రవేత్తలు. వ్యోమగాముల క్రిస్మస్ విందు కోసం కాల్చిన టర్కీ, కార్న్ బ్రెడ్ డ్రెస్సింగ్, క్రాన్బెర్రీ సాస్, షార్ట్ బ్రెడ్ కుకీలు, ఐసింగ్ గొట్టాలను తీసుకువెళుతోంది డ్రాగన్. ఈ నౌక సోమవారం(నేడు) మధ్యాహ్నం ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. నెలరోజుల పాటు అక్కడే ఉండనుంది.
"మీరు చూస్తున్న ప్రతిచోట డ్రాగన్స్ ఉంటాయి. నాసా వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతున్న క్రమంలో.. అంతరిక్ష కేంద్రంలో ఎల్లప్పుడూ ఒక డ్రాగన్ క్యాప్సుల్ ఉండాలని స్పేస్ఎక్స్ భావిస్తోంది. ఈ ప్రయోగం మొత్తం.. నాసా వ్యోమగామి కేట్ రుబిన్స్కు క్రిస్మస్ బహుమతిగా చేపట్టిందే."