ఉగ్రవాద నిర్మూలనపై ప్రపంచ దేశాలు జరుపుతున్న ఐక్య పోరాటానికి భంగం కలిగించేందుకు కుట్ర జరుగుతోందని భారత్ ఆరోపించింది. అమెరికాపై దాడులు జరిగిన 20 ఏళ్లకు మళ్లీ ఈ ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొంది. ఈ క్రమంలోనే జాతి, జాతీయతకు సంబంధించి పలు అతివాద సిద్ధాంతాలతో ఉగ్రవాదం పుట్టుకొస్తోందంటూ ప్రచారం సాగుతోందని తెలిపింది. దీనికి ప్రభావితం అయితే దాదపు 20 ఏళ్ల వెనక్కు వెళ్లడమే కాక.. ఇన్నాళ్లు ఉగ్రవాదంపై జరిపిన పోరు అంతావృథా అవుతుందని హెచ్చరించింది. ఐరాస జనరల్ అసెంబ్లీలో ఉగ్రవాద నిర్మూలనపై జరిగిన చర్చల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది భారత్.
అప్పుడు అలా..
"అమెరికాపై సెప్టెంబరు 11 దాడులకు ముందు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు భిన్నాభిప్రాయాలు ఉండేవి. ఉగ్రవాదాన్ని సిద్ధాంతాలు, మతాల ఆధారంగా విభజించి.. మీ ఉగ్రవాదం, మా ఉగ్రవాదం అన్నట్టుగా వ్యవహరించేవి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అందరిలో మళ్లీ ఆ తరహా అభిప్రాయం ఏర్పడేలా కుట్ర జరుగుతోంది. ప్రపంచ దేశాలు చరిత్రను మర్చిపోలేదని.. ఉగ్రవాదాన్ని వివిధ రకాలుగా విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటాయని ఆశిస్తున్నాను."