అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం కుడి ఇంజన్ విఫలం కావడం వల్ల.. డెన్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఈ సమయంలో విమానం నుంచి కొన్ని వస్తువులు కింద పడడం కలకలం రేపింది. విమానం నుంచి పడిన వస్తువులు కింద ఉన్న కొన్ని నివాస గృహాల ముందర పడ్డాయి. ఇళ్లపైనా, మనుషులపైనా వస్తువులు పడకపోవడం వల్ల ముప్పు తప్పింది.
విమానాశ్రయంలో విమానం సురక్షితంగానే దిగిందని, ప్రయాణికులకు పెద్ద ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. విమానం డెన్వర్ నుంచి హొనొలులుకు వెళుతుండగా.. ఇంజిన్ చెడిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం బయలుదేరిన కాసేపటికే భారీ కుదుపులకు గురికాగా, కేబిన్‌లో భారీ పేలుడు జరిగినట్లు పైలెట్ మైకులో ప్రయాణికులకు తెలిపాడు.