Covid vaccine benefits: ఇప్పటికే కొవిడ్-19 బారినపడ్డారా? టీకాలు కూడా పూర్తిగా తీసుకున్నారా? అయితే ఒంట్లో కొవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల ఉత్పత్తి పుంజుకున్నట్టే. అంతేకాదు, వివిధ వైరస్ రకాలను ఎదుర్కొనేలా యాంటీబాడీల సామర్థ్యం మెరుగైనట్టే. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్‌ఏంజెలిస్ (యూసీఎల్‌ఏ) అధ్యయనం ఇదే పేర్కొంటోంది. డెల్టా రకంతో పాటు ఇతరత్రా కొవిడ్ వైరస్ రకాలను ఎదుర్కొనేలా యాంటీబాడీల సామర్థ్యం పెంపొందటంలో బూస్టర్ టీకాలు అంతే సమర్థంగా ఉపయోగపడగలవని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
Covid infection and vaccination
అధ్యయనంలో భాగంగా ముందుగా కొవిడ్ టీకాలు తీసుకొని, ఇంకా ఇన్‌ఫెక్షన్ బారినపడనివారిలో.. అలాగే ఇటీవల ఇన్‌ఫెక్షన్ బారినపడి, ఇంకా టీకాలు తీసుకోనివారిలో యాంటీబాడీల తీరుతెన్నులను పరిశీలించారు. అనంతరం ఇన్‌ఫెక్షన్ బారినపడ్డవారు టీకాలు తీసుకున్నాక వారిలో పుట్టుకొచ్చిన యాంటీబాడీలనూ పోల్చి చూశారు. కేవలం సహజ ఇన్‌ఫెక్షన్‌తో గానీ టీకాలతో గానీ పుట్టుకొచ్చిన యాంటీబాడీలతో పోలిస్తే.. గతంలో ఇన్‌ఫెక్షన్ బారినపడి, టీకాలు తీసుకున్నవారిలో యాంటీబాడీలు సమర్థంగా వైరస్‌ను ఎదుర్కొంటున్నట్టు బయటపడింది.